పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఐకేపీ ఉద్యోగులకు సూచించారు. ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో సోమవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఐకేపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐకేపీ ఉద్యోగుల పోరాటం మరువలేనిదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలను సీఎం కేసీఆర్ పెంచినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం చేసిన సమ్మెలో ఐకేపీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. మహిళా సంఘాలను కదిలించిన పాత్ర ఐకేపీ ఉద్యోగులదన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ వెంకటయ్యగౌడ్, జెడ్‌ఎంఎస్ అధ్యక్షురాలు సలోమి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదర్శన్, సక్రునాయక్, లక్ష్మయ్య, నాగమల్లిక, యాదగిరి, మహేష్, రాజప్ప, బాల్‌రాజు, ఈశ్వర్, అక్తర్, వెంకట్, సురేఖ పాల్గొన్నారు.