పేద వైశ్యుల కోసం ఓ కార్పొరేషన్
వైశ్య ప్రముఖులతో వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పేద వైశ్యుల సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ఓ కార్పొరేషన్ ఉండాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్య వైశ్య మహాసభ ప్రముఖులు పలువురు మంగళవారం జగన్ నివాసంలో ఆయన్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు.
ఏపీలో 70 శాతానికి పైగా వైశ్యులు పేదరికంలోనే ఉన్నారని జగన్ దృష్టికి తెచ్చారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తమ వారు రాణించాలంటే వారి కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్పొరేషన్ కావాలన్న తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు. జగన్ వారితో పూర్తిగా ఏకీభవించారు. సమాజ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేస్తున్న వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తానని జగన్ చెప్పారు. ఇందు కోసం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఒకవేళ ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పని చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.