poosapatirega
-
యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం
సాక్షి, విజయనగరం: పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో ప్రియుడు పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దిశా యాప్ ద్వారా పోలీసులు బాధితురాలిని రక్షించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. దిశ యాప్ సమాచారంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించామని బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. -
25 అడుగులు ముందుకొచ్చిన సముద్రం
పూసపాటిరేగ (విజయనగరం): సముద్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూసపాటిరేగ తీర ప్రాంతంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతంలో గాలులు వీయడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 25 అడుగుల వరకూ సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా విజయనగరం జిల్లా పూసపాటిరేగ తహశీల్దార్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఓలు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేవిధంగా చర్యలు తీసుకున్నారు. సముద్ర తీరంలో ఉన్న చింతపల్లి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సమాచారం అందించేందుకు వీలుగా మెరైన్ పోలీస్ స్టేషన్లో హైఫ్రీక్వెన్సీ వైర్ లెస్ సెట్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి ,తిప్పలవలస ,పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, కోనాడ గ్రామాలలో మత్స్యకారులు ఆదివారం సాయింత్రం నుంచే వేటను నిలిపివేశారు. మత్స్యకార గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.