Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర...
సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు.
గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు
విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది.
నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి.
డబ్బు కోసం ఏమైనా చేస్తారు
గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు.
సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
తుపాకీ స్టైలే...!
పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు.
ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి.
దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్