నాడు అశాంతి... నేడు అభివృద్ధి!
అంగోలా
అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకో వడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా ... పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాతి కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయినప్పటికీ... తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది.
చిత్రమేమిటంటే, పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది.
పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేష నల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది. 1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీ వెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే... అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది.
చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది. అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి!
టాప్ టెన్
1. అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్బాల్.
2. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది.
3. ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు.
4. చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరు.
5. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది.
6. అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం... సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు.
7. అంగోలా రాజధాని లువాండాను ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు.
8. అంగోలాలో మరణాల రేటు ఎక్కువ.
9. ‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది.
10. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది.
దేశం : అంగోలా
రాజధాని : లువాండా
అధికార భాష : పోర్చుగీస్
కరెన్సీ : క్వాంజా
జనాభా : 2 కోట్ల 43 లక్షల 83 వేలు (సుమారుగా)