Port Trust
-
వైజాగ్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి క్రూయిజ్ టెర్మినల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.96 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సంస్థ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ దూబే వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ట్రేడ్ మీట్ సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. ‘మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సహకారంతో క్రూయిజ్ టెర్మినల్ నెలకొల్పుతున్నాం. పర్యాటక రంగ వృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. క్రూయిజ్‌లో 2,000 మందికిపైగా ప్రయాణించే సామ ర్థ్యం ఉంటుంది’ అని వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే.. అడ్డంకుల్లేని రవాణా..: రైలు, రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి పోర్టుకు.. అలాగే పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. తూర్పు ప్రాంతంలో ప్రధాన పోర్టుగా నిలవాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం మౌలిక వసతులకు 2–3 ఏళ్ల లో రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వెస్ట్, ఈస్ట్ క్యూ బెర్త్‌ల ఆధునీకరణకు రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పోర్టును కంటైనర్ ట్రాన్షిప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నుంచి..: ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రధానంగా ముంబై పోర్ట్ ద్వారా కార్గో రవాణా జరుగుతోంది. ఏటా 30 లక్షల టన్నుల సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. వైజాగ్ పోర్ట్ సమీపంలో ఉన్నప్పటికీ భాగ్యనగర వర్తకులు ముంబై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అర్హతగల వర్తకులకు చార్జీల్లో భారత్‌లో అత్యధికంగా 80 శాతం తగ్గింపు ఇస్తున్నాం. చార్జీల పరంగా చవకైన పోర్టు ఇదే. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న కార్గోలో 10 లక్షల టన్నులు వైజాగ్ పోర్ట్ నుంచి జరిగేలా ప్రణాళికతో ఉన్నాం. ► కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా నౌకలు, కంటైనర్ల కొరత ఉంది. చార్జీలు అధికమయ్యాయి. పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. సాధారణ స్థితికి రావడానికి 6–12 నెలలు పట్టొచ్చు. 2020–21 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.89 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 2021–22లో 7.1 కోట్ల టన్నులు ఆశిస్తున్నాం. పోర్టు కార్గో రవాణాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 30 శాతముంది. -
విశాఖ షిప్పింగ్ బోటులో స్వల్ప అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యూ 5 బెర్త్‌లోని కోస్టల్ షిప్పింగ్ బోటులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి పనామా బిడి 51 నౌక నిన్న (శనివారం) రాత్రి విశాఖ పోర్టుకు చేరుకుంది. నౌకల్లోకి సిబ్బందిని మార్చేందుకు ఈ కోస్టల్ షిప్ ను వినియోగిస్తారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో షిప్ క్యాబిన్ రూమ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన నౌకా సిబ్బంది పోర్ట్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఇది స్వల్ప ప్రమాదమేనని పోర్టు ట్రస్ట్ యాజమాన్యం తెలిపింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని పోర్ట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనాకొచ్చారు. (మంటల్లో చిక్కుకున్న చేపల బోటు, అంతా సేఫ్) -
నేడు మోదీ, మమత భేటీ
కోల్‌కతా: ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ కానున్నట్లు సెక్రెటేరియట్ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి కోల్‌కతా చేరుకోగానే, సాయంత్రం 4 గంటల సమయంలో భేటీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో ప్రభుత్వం చెప్పలేదు. ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇప్పటికే నౌకాయాన మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యక్తిగతంగా మమతను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 13న సోనియా గాంధీ తలపెట్టిన ప్రతిపక్షాల భేటీని కూడా వ్యతిరేకించారు. మోదీ, మమతల భేటీ గురించి సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి బయటపడిందని వ్యాఖ్యానించారు. -
2015కల్లా విశాఖ పోర్టుకు భారీ నౌకలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ పోర్టుకు పూర్వ వైభవ ం తీసుకొచ్చే దిశగా శర వేగంగా అభివృద్ది పనులు చేపడుతున్నామని చైర్మన్ ఎంటి కృష్ణబాబు చెప్పారు. పోర్టు చైర్మన్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. 2500 కోట్ల పెట్టుబడులతో పోర్టు అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే 2015 వరకూ ఆగాల్సిందేనని అప్పుడే భారీ నౌకలకు చోటు కల్పించే అవకాశం వుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు, మెకనైజ్డ్ పనులే కీలకంగా వున్నందున వాటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు. పోర్టు ఆధునికీకరణలో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులన్నీ నిర్ణీత వేళలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ పోర్టులతో సమానంగా ప్రస్తుత రోజుల్లో పరుగెత్తడం సాధ్యం కానందున మౌళికవసతులన్నీ సమకూర్చుకుని పూర్వ వైభవానికి బాటలు వేస్తామని చెప్పారు. కార్గో రవాణాలో పోటీ ఎక్కువగా వున్నందున పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్దతిలో కలిసి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. గత మూడేళ్లుగా పోర్టు ఆదాయం తగ్గుతోందని అందుకు డ్రెడ్జింగ్ పనులు లేకపోవడమేనన్నారు. భారీ నౌకలు వచ్చే అవకాశం లేక ఆదాయానికి గండిపడుతోందన్నారు. కొత్తగా వచ్చిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకే ప్లాట్‌ఫారంపై ఆరు నౌకలు వుండే అవకాశం వుందని అందుకే అక్కడ రెవెన్యూ పెంచుకోగలుగుతున్నారని చెప్పారు.రానున్న ఆగష్టు మాసం నాటికి రూ. 230 కోట్లు ఖర్చు చేసి 16.1 మీటర్ల డ్రెడ్జింగ్ పూర్తి చేయాలనుకుంటున్నామని చెప్పారు. కనీసం 10 నుంచి 14 మీటర్ల డ్రెడ్జింగ్ చేయకపోతే ఇప్పటి వరకూ చేసిన డ్రెడ్జింగ్ అంతా వృధా అయ్యే అవకాశం వుందని వెల్లడించారు. లూజ్ సాయిల్ కావడంతో డ్రెడ్జింగ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. పోర్టులోనికి ప్రవేశించే ద్వారం వద్ద డ్రెడ్జింగ్ పూర్తయిన తర్వాతే మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తామన్నారు.