
మోదీ, మమతా బెనర్జీ
కోల్‌కతా: ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ కానున్నట్లు సెక్రెటేరియట్ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి కోల్‌కతా చేరుకోగానే, సాయంత్రం 4 గంటల సమయంలో భేటీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో ప్రభుత్వం చెప్పలేదు. ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు.
ఇప్పటికే నౌకాయాన మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వ్యక్తిగతంగా మమతను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 13న సోనియా గాంధీ తలపెట్టిన ప్రతిపక్షాల భేటీని కూడా వ్యతిరేకించారు. మోదీ, మమతల భేటీ గురించి సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి బయటపడిందని వ్యాఖ్యానించారు.