porters
-
సరిహద్దుల్లో పాక్ పాశవికం
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) పాశవిక చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికులకు నిత్యావసరాలను అందించే పోర్టర్లే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం విచక్షణారహితంగా మోర్టార్లు ప్రయోగించింది. దీంతో గుల్పూర్ సెక్టార్‌లోని కస్సాలియాన్ గ్రామానికి చెందిన పోర్టర్లు మొహమ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్(23) చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అస్లాం(28) శరీరాన్ని ఛిద్రం చేసిన బీఏటీ అతని తలను వెంట తీసుకెళ్లిందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశామని, వారి అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన పోర్టర్లు సలీం, షౌకత్, అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. సైనికుడనే వాడెవడూ ఇలాంటి హేయమైన చర్యలకు దిగడనీ, వీటికి సరైన సమయంలో సైనికరీతిలో స్పందిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. సామాన్యులను పాక్ సైన్యం పొట్టనబెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాగా, సరిహద్దుల వెంట చొరబాటు, ఉగ్ర చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా ఏర్పాటైన బీఏటీలో పాక్ సైనికులతోపాటు ఉగ్రవాదులు కూడా సభ్యులుగా ఉంటారు. -
ఆర్మీలో పోర్టర్ల నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యంలో పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా నూతన విధానానికి రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నెలసరి వేతనంపై పోర్టర్లను భారత సైన్యం నియమించుకునేందుకు ఈ విధానం వెసులుబాటు కల్పిస్తుంది. పోర్టర్లకు నెలకు రూ 18,000 వేతనంతో పాటు వారు పనిచేసే ప్రాంతం, వాతావరణం, ప్రాణాపాయం వంటి అంశాల ప్రాతిపదికన కాంపెన్సేటరీ వేతనం, వైద్య సేవలు వంటి ఇతర సదుపాయాలను కల్పిస్తారు. గతంలో ఆర్మీలో పోర్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకునేవారు. వారికి ఎలాంటి ఇతర సదుపాయాలూ అందుబాటులో ఉండేవి కావు. పోర్టర్లకు సరైన మౌలిక వసతులు కొరవడటంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పోర్టర్లకు మెరుగైన విధానాన్ని అందుబాటులోకి తేవాలని గత ఏడాది జనవరి 2న సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. -
ఉరీ ఉగ్రదాడి: ఇంటిదొంగల హస్తంపై ఆధారాలు!
ఉరీ: పాకిస్థాన్ సరిహద్దులోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నుంచి వచ్చి పకడ్బందీగా దాడిచేసి 18 మంది భారత జవాన్లను అంతంచేసిన ముష్కరులకు ఇంటిదొంగలు సాయం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. ఉరీ ఆర్మీ క్యాంప్ లో సరుకురవాణా కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రిషిన్లుగా పనిచేస్తున్నవారిలో కొందరు స్థావరానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేడంతోపాటు ముష్కరుల తరఫున గూఢచర్యం కూడా నిర్వహించినట్లు తెలిసింది. (తప్పక చదవండి: ఉరీ దాడి ఇలా జరిగింది) ఉరీ ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ గురువారం కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉరీ లోని 12వ పదాధిదళాల క్యాంప్ లో దాదాపు 40 మంది సరుకురవాణా కూలీలు పనిచేస్తున్నారు. జవాన్లు, అధికారులకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సరుకులు తీసుకొచ్చే వీరంతా ప్రైవేటు వ్యక్తులే కావడం గమనార్హం. రోజూ వస్తూ పోయే ఈ పోర్టర్లకు క్యాంప్ లోపలి ఆవరణలో ఎక్కడెక్కడ ఏముందో కొట్టిన పిండి. పోర్టర్లు తీసుకొచ్చిన నిత్యావసరాలను నిలువ చేసే వంటశాలకు సమీపంలోనే ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించడాన్ని బట్టిచూస్తే.. ఆ మార్గం ఇంటిదొంగలు సూచించిందే అయిఉంటుందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉగ్రవాదులు రావడానికి ముందు ఇంటిదొంగలైన ఇద్దరు గూఢచారులు.. పాక్ సరిహద్దులోని కొండల నుంచి అటవీమార్గం గుండా ఉరీ సైనిక స్థావరం వరకు రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అది ఉగ్రవాదులకు పూర్తిగా సురక్షితమైన మార్గమని నిర్ధారించుకున్న తర్వాతే జైషే తన తోడేళ్లను రంగంలోకి దింపింది. పోర్టర్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఉరీ ఉగ్రదాడి జరగడానికి మూడు రోజుల ముందు సైనిక శిబిరంలో పనిచేస్తోన్న సరుకురవాణా కూలీల(పోర్టర్ల)ను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్టర్లతో ఎక్కువ పనిచేయిస్తూ తక్కువ జీతాలు ఇస్తున్నారంటూ ఆర్మీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'పోర్టర్లేమైనా పశువులా?' అని ప్రశ్నించింది. కీలకమైన సైనిక స్థావరంలో తక్కువ జీతానికి పనిచేసే ఈ పోర్టర్లకు ఉగ్రవాద సంస్థలు ఎక్కువ డబ్బును ఎరగాచూపి తమకు అనుకూలంగా పనిచేయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు
చెన్నై నుంచే ఆపరేషన్ దినకూలి నుంచి కాంట్రాక్ట్‌కు మారిన స్మగ్లింగ్ ఆరడుగుల దుంగకు రూ.5 వేలు అరెస్టులను లెక్క చేయని అక్రమార్కులు వాహనాలు మారుస్తూ రవాణా పోలీసులకు కొత్త సవాళ్లు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు వ్యూహం మార్చారు. పాత జాబితాలోని వారు, పోలీసులు వెతుకుతున్న స్మగ్లర్లు రంగంలోకి రావడం మానేశారు. చెన్నై నుంచే స్మగ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు విజయా డెయిరీ సమీపంలో 33 మందికిపైగా ఎర్రచందనం కూలీలను శనివారం అరెస్టు చేశారు. పదిహేను ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రెం డు రోజుల క్రితం గుడిపాల పోలీసులు ఎర్రచందనం నరికేందుకు వస్తున్న 60 మంది తమిళ తంబీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. భారం అంతా కూలీలపైనే గతంలో స్మగ్లర్లు అడవి నుంచి సమీపంలోని రోడ్డులో ఉన్న వాహనం వరకే కూలీలను వాడుకునేవారు. ఎర్రచందనం నరికి తెచ్చి వాహనంలో చేరిస్తే దుంగకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చేవారు. ఇప్పుడు తాము రంగంలోకి రాకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వ్యూహం మార్చారు. ఎర్రచందనం నరికే తమిళ తంబీలను కూలీల నుంచి చిన్నపాటి కాంట్రాక్టు స్మగ్లర్లుగా మార్చేశారు. వీరు ఎర్రచందనం నరికి వాహనాల్లో చెన్నైలోని గోడౌన్లకు చేరుస్తున్నారు. ప్రతిఫలంగా ఆరు అడుగుల ఎర్రచందనం దుంగకు రూ.5 వేల వరకు స్మగ్లర్లు చెల్లిస్తున్నారు. కొత్త వ్యూహాలు ఇలా.. గతంలో అడవిలో నరికిన ఎర్రచందనం దుంగలను సమీప గ్రామాల్లో రోడ్డు పక్కనే సిద్ధంగా ఉన్న వాహనాల్లోకి చేర్చేవారు. అక్కడి నుంచి నేరుగా రవాణా చేసేవారు. ఇప్పుడు నిఘా పెరగడంతో స్మగ్లర్ల వ్యూహం మారింది. ప్రస్తుతం కీలక స్మగ్లర్లు, వారి అనుచరులు, దళారులు ప్రత్యక్షంగా రంగంలోకి రావడం లేదు. విల్లుపురం, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన తమిళ కూలీలకు డబ్బు ఆశ చూపి చిత్తూరు జిల్లాకు పంపుతున్నారు. వారే నేరుగా చెన్నై హార్బర్ సమీపంలోని స్మగ్లర్ల గోడౌన్లకు సరుకు (ఎర్రచందనం) చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలు, వారిని నడిపించే మేస్త్రీలే పట్టుబడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా చామల, మామండూరు, బాలయపల్లె ఫారెస్టు రేంజ్‌ల్లోని శేషాచలం కొండల్లో లభించే ఎర్రచందనం దుంగలు నాణ్యంగా, బరువుగా ఉంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అధికం. ప్రస్తుతం తనిఖీలు అధికంగా ఉండడంతో వీటిని వేగంగా తరలించే పరిస్థితి లేదు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు నేరుగా ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించడం లేదు. దుంగలను నరికిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామాలు లేదా అటవీ ప్రాంతం, చెరువు కట్టల కింద డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పొదల్లో, నీళ్లలో దుంగలను దాచి ఉంచుతున్నారు. రెండు, మూడు రోజుల అనంతరం పోలీసుల అలికిడి లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల వరకు ఒక వాహనం, అక్కడ నుంచి మరో వాహనంలో తలిస్తున్నారు. దీనివల్ల వాహనం ప్రారంభ సమయంలో ఎవరైన పోలీసు ఇన్ఫార్మర్లు సమాచారం ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్తవ్యూహాలతో పోలీసులకు కొత్తసవాళ్లు ఎదురవుతున్నాయి.