‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు | 'Red' to the thieves strategy | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు

Published Mon, Feb 17 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు

‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు

  •     చెన్నై నుంచే ఆపరేషన్
  •      దినకూలి నుంచి కాంట్రాక్ట్‌కు మారిన స్మగ్లింగ్
  •      ఆరడుగుల దుంగకు రూ.5 వేలు
  •      అరెస్టులను లెక్క చేయని అక్రమార్కులు
  •      వాహనాలు మారుస్తూ రవాణా
  •      పోలీసులకు కొత్త సవాళ్లు
  •  సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు వ్యూహం మార్చారు. పాత జాబితాలోని వారు, పోలీసులు వెతుకుతున్న స్మగ్లర్లు రంగంలోకి రావడం మానేశారు. చెన్నై నుంచే స్మగ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు విజయా డెయిరీ సమీపంలో 33 మందికిపైగా ఎర్రచందనం కూలీలను శనివారం అరెస్టు చేశారు. పదిహేను ఎర్రచందనం  దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రెం డు రోజుల క్రితం గుడిపాల పోలీసులు ఎర్రచందనం నరికేందుకు వస్తున్న 60 మంది తమిళ తంబీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
     
    భారం అంతా కూలీలపైనే
     
    గతంలో స్మగ్లర్లు అడవి నుంచి సమీపంలోని రోడ్డులో ఉన్న వాహనం వరకే కూలీలను వాడుకునేవారు. ఎర్రచందనం నరికి తెచ్చి వాహనంలో చేరిస్తే దుంగకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చేవారు. ఇప్పుడు తాము రంగంలోకి రాకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వ్యూహం మార్చారు. ఎర్రచందనం నరికే తమిళ తంబీలను కూలీల నుంచి చిన్నపాటి కాంట్రాక్టు స్మగ్లర్లుగా మార్చేశారు. వీరు ఎర్రచందనం నరికి వాహనాల్లో చెన్నైలోని గోడౌన్లకు చేరుస్తున్నారు. ప్రతిఫలంగా ఆరు అడుగుల ఎర్రచందనం దుంగకు రూ.5 వేల వరకు స్మగ్లర్లు చెల్లిస్తున్నారు.
     
    కొత్త వ్యూహాలు ఇలా..
     
    గతంలో అడవిలో నరికిన ఎర్రచందనం దుంగలను సమీప గ్రామాల్లో రోడ్డు పక్కనే సిద్ధంగా ఉన్న వాహనాల్లోకి చేర్చేవారు. అక్కడి నుంచి నేరుగా రవాణా చేసేవారు. ఇప్పుడు నిఘా పెరగడంతో స్మగ్లర్ల వ్యూహం మారింది. ప్రస్తుతం కీలక స్మగ్లర్లు, వారి అనుచరులు, దళారులు ప్రత్యక్షంగా రంగంలోకి రావడం లేదు. విల్లుపురం, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన తమిళ కూలీలకు డబ్బు ఆశ చూపి చిత్తూరు జిల్లాకు పంపుతున్నారు. వారే నేరుగా చెన్నై హార్బర్ సమీపంలోని స్మగ్లర్ల గోడౌన్లకు సరుకు (ఎర్రచందనం) చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలు, వారిని నడిపించే మేస్త్రీలే పట్టుబడుతున్నారు.
     
    గుట్టుచప్పుడు కాకుండా రవాణా

    చామల, మామండూరు, బాలయపల్లె ఫారెస్టు రేంజ్‌ల్లోని శేషాచలం కొండల్లో లభించే ఎర్రచందనం దుంగలు నాణ్యంగా, బరువుగా ఉంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ అధికం. ప్రస్తుతం తనిఖీలు అధికంగా ఉండడంతో వీటిని వేగంగా తరలించే పరిస్థితి లేదు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు నేరుగా ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించడం లేదు. దుంగలను నరికిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామాలు లేదా అటవీ ప్రాంతం, చెరువు కట్టల కింద డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

    పొదల్లో, నీళ్లలో దుంగలను దాచి ఉంచుతున్నారు. రెండు, మూడు రోజుల అనంతరం పోలీసుల అలికిడి లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల వరకు ఒక వాహనం, అక్కడ నుంచి మరో వాహనంలో తలిస్తున్నారు. దీనివల్ల వాహనం ప్రారంభ సమయంలో ఎవరైన పోలీసు ఇన్ఫార్మర్లు సమాచారం ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్తవ్యూహాలతో పోలీసులకు కొత్తసవాళ్లు ఎదురవుతున్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement