ఉరీ ఉగ్రదాడి: ఇంటిదొంగల హస్తంపై ఆధారాలు!
ఉరీ: పాకిస్థాన్ సరిహద్దులోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నుంచి వచ్చి పకడ్బందీగా దాడిచేసి 18 మంది భారత జవాన్లను అంతంచేసిన ముష్కరులకు ఇంటిదొంగలు సాయం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. ఉరీ ఆర్మీ క్యాంప్ లో సరుకురవాణా కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రిషిన్లుగా పనిచేస్తున్నవారిలో కొందరు స్థావరానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేడంతోపాటు ముష్కరుల తరఫున గూఢచర్యం కూడా నిర్వహించినట్లు తెలిసింది. (తప్పక చదవండి: ఉరీ దాడి ఇలా జరిగింది)
ఉరీ ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ గురువారం కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉరీ లోని 12వ పదాధిదళాల క్యాంప్ లో దాదాపు 40 మంది సరుకురవాణా కూలీలు పనిచేస్తున్నారు. జవాన్లు, అధికారులకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సరుకులు తీసుకొచ్చే వీరంతా ప్రైవేటు వ్యక్తులే కావడం గమనార్హం. రోజూ వస్తూ పోయే ఈ పోర్టర్లకు క్యాంప్ లోపలి ఆవరణలో ఎక్కడెక్కడ ఏముందో కొట్టిన పిండి. పోర్టర్లు తీసుకొచ్చిన నిత్యావసరాలను నిలువ చేసే వంటశాలకు సమీపంలోనే ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించడాన్ని బట్టిచూస్తే.. ఆ మార్గం ఇంటిదొంగలు సూచించిందే అయిఉంటుందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉగ్రవాదులు రావడానికి ముందు ఇంటిదొంగలైన ఇద్దరు గూఢచారులు.. పాక్ సరిహద్దులోని కొండల నుంచి అటవీమార్గం గుండా ఉరీ సైనిక స్థావరం వరకు రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అది ఉగ్రవాదులకు పూర్తిగా సురక్షితమైన మార్గమని నిర్ధారించుకున్న తర్వాతే జైషే తన తోడేళ్లను రంగంలోకి దింపింది.
పోర్టర్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఉరీ ఉగ్రదాడి జరగడానికి మూడు రోజుల ముందు సైనిక శిబిరంలో పనిచేస్తోన్న సరుకురవాణా కూలీల(పోర్టర్ల)ను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్టర్లతో ఎక్కువ పనిచేయిస్తూ తక్కువ జీతాలు ఇస్తున్నారంటూ ఆర్మీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'పోర్టర్లేమైనా పశువులా?' అని ప్రశ్నించింది. కీలకమైన సైనిక స్థావరంలో తక్కువ జీతానికి పనిచేసే ఈ పోర్టర్లకు ఉగ్రవాద సంస్థలు ఎక్కువ డబ్బును ఎరగాచూపి తమకు అనుకూలంగా పనిచేయించుకున్నట్లు తెలుస్తోంది.