ఆడవాళ్లను దొంగ పెళ్ళిళ్లు చేసుకున్న కి‘లేడీ’
సాక్షి, డెహ్రాడూన్ : కట్నం డబ్బులు కాజేయడం కోసం మగువలను మగవాళ్లు మోసం చేసి పలు పెళ్లిళ్లు చేసుకునే మగవాళ్లను చూశాం. అలాగే, బాగా డబ్బున్న డాబుసరి బాబుల దగ్గర డబ్బును కాజేసేందుకు మోసం చేసి మగువలే పలు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అక్కడక్కడా చూశాం. కానీ, తాజాగా మాత్రం కట్నం డబ్బుల కోసం ఓ మగవాడు కాకుండా ఓ యువతే మగరాయుడి వేషం వేసుకొని పలువురు యువతులను పెళ్లిళ్లు చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు యువతులను కట్నం కోసం పెళ్లి చేసుకున్న కష్ణా సేన్ అలియాస్ స్వీటీ సేన్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్కు చెందిన స్వీటీ సేన్, కష్ణాసేన్గా అవతారమెత్తి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించింది. మగరాయుడిలాగా దుస్తులు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతూ అమ్మాయిలను బుట్టలో పడేయడం, పెళ్లి చేసుకోవడం అలవాటుగా మార్చుకుంది. పెళ్లి చేసుకున్న మొదటి భార్యను వెంటనే వదిలేసి, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని కట్నకానుకల కోసం వేధించడం వల్ల వ్యవహారం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ స్వీట్ సేన్ విచారించిన పోలీసులు ఇతర కేసుల గురించి ఆమెను విచారిస్తున్నారు.
పెళ్లిళ్లకు డెకరేషన్ పేరిట, క్యాటరింగ్ పేరిట పలువురిని మోసం చేసినట్లు కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. స్వీటీ సేన్ తల్లి నిర్మలా సేన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దొంగ పెళ్లిళ్లలో ఆమెది కూడా ముఖ్యపాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్కు స్వీటీ సేన్ బంధువులుగా, మిత్రులుగా హాజరైన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు ఇంకా దర్యాప్తులో ఉందని పోలీసు అధికారి మంజూ జ్వాల తెలిపారు.