post box
-
కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్
చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్ నంబర్ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. -
‘తపాలా’ శరాఘాతం
బ్యాంకులతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వశాఖల విధివిధా నాలు మారుతున్నా తపాలాశాఖ మాత్రం తన తీరును మార్చు కోవటం లేదు. తపాలా కార్యాలయాల్లో బీమాతో కూడిన చిన్న మొత్తాల పొదుపు చేసుకునే మదుపుదారులపై విచిత్రంగా సేవా పన్ను విధిస్తోంది. ఉద్యోగస్తుల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలపై (ఏడాదిలోపు ఖాతాలపై 3.5 శాతం, ఏడాది దాటితే 1.75 శాతం) రుసుమును సేవా పన్ను రూపంలో జూన్ 2015 నుండి నెల నెలా వసూలు చేస్తున్నారు. నెల నెలా పొదుపు చేసుకునేది పేద, మధ్యతరగతి ప్రజానీకమే. అలాంటి పొదుపుదారులపై సేవాపన్ను వసూలు చేయాల నుకోవడం ఎందుకో కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. పొదుప రులను ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన తపాలాశాఖ విధానాలు వారిని నిరుత్సాహపరచేవిగా ఉంటున్నాయి. ఇప్ప టికే ప్రైవేటు బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకులు పోటా పోటీగా అనేక పొదుపు పథకాలతో ప్రజల ముంగిటకు వస్తున్నాయి. కనుక తపాలాశాఖ సేవాపన్నును రద్దు చేసి ప్రజల నుండి మరింత పొదుపు సేకరించడానికి సరళమైన పొదుపు పథకాలు ప్రవేశపెట్టాలి. పసునూరి శ్రీనివాస్ మెట్పల్లి, కరీంనగర్ జిల్లా -
ఎర్రడబ్బాకు కొత్త రూపం!
ఎర్రడబ్బా రూపం మారుతోంది. ఇన్నాళ్లబట్టి ఇనుముతో రూపొందించిన పోస్టు బాక్సులు ఎప్పటికప్పుడు తుప్పుపట్టి, పాడైపోవడం, దాంతో వాటిలో లెటర్లు వేయడానికి జనం భయపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు పోస్టల్ శాఖ ఓ పరిష్కారం కనుగొంది. సరికొత్త విధానంలో పోస్టుబాక్సులను రూపొందించింది. త్వరలోనే ఇవన్నీ రోడ్ల మీద దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే వరంగల్ పోస్టాఫీసుకు ఇలాంటిది ఓ బాక్సు చేరుకుంది. తుప్పు పట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని రూపొందించారు. నగరాల్లో అయితే మొబైల్ ఫోన్లు, ఈమెయిళ్లతోనే సమాచారం పంపుకొంటున్నా, ఇప్పటికీ గ్రామాల్లో మాత్రం ఎర్రడబ్బాలకు ఆదరణ తగ్గలేదు. అలాగే వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా కూడా పోస్టుబాక్సులను ఆశ్రయించాల్సిందే. కొన్ని స్కాలర్షిప్పులకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా పోస్టులో పంపాల్సిందే. చాలావరకు కొరియర్ సర్వీసుల కన్నా కూడా స్పీడ్ పోస్టు వేగంగా వెళ్తుందని, ఖర్చు కూడా తక్కువని భావిస్తున్నారు. అందుకే ఈ సరికొత్త పోస్టు బాక్సుతో మరింత ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.