post metric students
-
‘28న కలెక్టరేట్ల ముట్టడి ’
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విడుదల కోసం ఈనెల 28న బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఉపకారవేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
దరఖాస్తులేవీ?
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 30తో ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగుస్తుంది. జూలై రెండో వారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినా కనీసం మూడో వంతు విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం అధికారవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే దరఖాస్తులు స్వీకరించి 3 నెలల్లోపు పరిశీలన చేపట్టి విద్యాసంవత్సరం మధ్యలోనే ఉపకారవేతనాలు పంపిణీ చేయాలని సంక్షేమాధికారులు అనుకున్నా.. తాజా పరిస్థితి వారిని అయోమయానికి గురిచేస్తోంది. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ అధికారులు అంచనా వేశారు. పరిశీలన త్వరగా పూర్తి చేసేందుకు జూలై 10 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టగా బుధవారం నాటికి 4.66 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4.61 లక్షల మంది రెన్యువల్ విద్యార్థులుండగా.. 5 వేల మంది ఫ్రెషర్స్ ఉన్నారు. మొత్తంగా రెన్యువల్ కేటగిరీలో 45 శాతం దరఖాస్తులు సమర్పించారు. ఫ్రెషర్స్ కేటగిరీలో 2 శాతం కూడా మించలేదు. గడువు సమీపించినా ఆశించిన స్థాయిలో విద్యార్థులు స్పందించకపోవడంతో గడువు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ముందస్తు ఉపకారం లేనట్లే ఉపకారవేతన దరఖాస్తులు సకాలంలో వస్తే వేగంగా పరిశీలించి విద్యా సంవత్సరం మధ్యలో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనం అందించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా జూలై రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. కానీ 2 నెలలైనా మూడో వంతు దరఖాస్తులు కూడా రాలేదు. పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసినా నమోదు ఆశాజనకంగా లేకపోవడంతో గడువు పెంపు అనివార్యం కానుంది. నెల రోజుల పాటు గడువు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గతేడాది దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తవలేదు. దరఖాస్తుల సమర్పణలో జాప్యం జరగడం, వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యం కావడంతో 2017–18 దరఖాస్తులు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం వరకు తీసుకున్నారు. దీంతో పరిశీలన, స్కాలర్‌షిప్‌ల పంపిణీ ఆలస్యమైంది. ఈసారి దరఖాస్తుల స్వీకరణ ముందుగా నిర్వహించకుంటే గతేడాది పరిస్థితే పునరావృతం కానుందని ఓ అధికారి వాఖ్యానించారు. -
చెల్లుబాటు ఖాతాకే స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సంస్కరణలను ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొస్తోంది. స్కాలర్‌షిప్‌ల పంపిణీలో రివర్స్ ట్రాన్సాక్షన్ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం విద్యార్థుల ఖాతాలను పరిశీలించి చెల్లుబాటు ఖాతాలున్న వారికే ఉపకారవేతనాలు విడుదల చేయనున్నారు. ఖాతా సరైనది కాకుంటే.. ఒప్పందం ప్రకారం స్కాలర్షిప్ కోసం విద్యార్థులిచ్చిన ఖాతా సరైనదో కాదో ఎస్బీఐ అధికారులు తేల్చుతారు. బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారా లేక నిర్వహణ లోపంతో ఖాతా స్తంభించిపోయిందా నిర్ధారిస్తారు. అలాంటి ఖాతాలన్నీ సేకరించి సంబంధిత కళాశాలలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమిచ్చి ఆయా విద్యార్థులకు తెలియజేస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల నిర్వహణను ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో తేల్చనున్నారు. ఈ మేరకు గత వారం ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్బీఐ, ఎన్పీసీఐ అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఏటా 10 శాతం రద్దు రాష్ట్రంలో సగటున 13 లక్షల మంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు 12 లక్షలకు పైమాటే. అయితే సగటున 10 శాతం మంది తప్పుడు వివరాలు నమోదు చేయడం, లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ ఖాతాలు స్తంభిస్తున్నాయి. దీంతో వారికి ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నా ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. దీంతో సంక్షేమాధికారులు వారి ఖాతా నంబర్లను మళ్లీ సేకరించి మళ్లీ బిల్లులు రూపొందించి వాటిని ఖజానా శాఖకు సమర్పించి విడుదల చేయడం ప్రహసనమవుతోంది. దీంతో ఖాతాల పరిశీలనపై పర్యవేక్షణ ఉంటే మేలని భావించిన అధికారులు ఎస్బీఐతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖాతాల పరిశీలన పూర్తయితేనే సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. -
ఫీజు బకాయిలకు మోక్షం
రూ.418.11 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలకు మోక్షం లభించింది. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండిం గ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తొలివిడతలో రూ.418.11 కోట్లు విడుదల చేయగా వీటిని ప్రాధాన్యతాక్రమంలో విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. 2016–17 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 13.67 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన పథకాలకు అర్హత సాధించారు. ఈ పథకాల కింద అర్హులకు దాదాపు రూ.2,050.55 కోట్లు చెల్లించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దరఖాస్తుల పరిశీలన 60 శాతం పూర్తి 2016–17 విద్యా సంవత్సరంలో 13.67 లక్షల దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. ఏప్రిల్ రెండో వారంలో పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టారు. వసతిగృహ సంక్షేమాధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు 10.20 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల కింద రూ.1,556 కోట్లు చెల్లించాల్సి ఉంది. వచ్చే నెలలో మరో రూ.400 కోట్లు! ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలకు సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో మరో రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆలోపు దరఖాస్తుల పరిశీలన సైతం పూర్తికానుందని, బకాయిలపై స్పష్టత వచ్చిన తర్వాత మూడోవిడత పెద్దమొత్తంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.