postmurdam
-
మహిళ దారుణ హత్య
కొత్తకోట రూరల్ : జాతీయ రహదారి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాణిపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి తన పొలానికి వెళ్లగా ఓ మహిళ వివస్త్రగా పడిఉండటం గమనించాడు. వెంటనే రైతు సర్పంచు బాలయ్యకు ఫోన్‌చేసి చెప్పాడు. ఆయన కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి డీఎస్పీ శ్రీనువాస్‌రావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి అతి దారుణంగా తలపై బండరాయితో మోది హతమార్చారు. అంతటితో ఆగకుండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ వయసు సుమారు 25 నుండి 30 ఏళ్లలోపు ఉండవచ్చని, మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలో బీరుసీసాలు, వాటర్ప్యాకెట్లు పడి ఉన్నాయి. పరిసర ప్రాంతంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు ఎక్కడా కనిపించలేదు. హత్య చేసిన వారు తెలివిగా బట్టలను మాయం చేశారు. మృతి చెందిన మహిళ గృహిణియా, ఇంకెవరైనా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌బాబు తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన వాటర్ ప్యాకెట్లు గద్వాల ప్రాంతం జమ్మిచెడ్ ప్రాంతంలో తయారైనట్టు గుర్తించామని, మృతురాలెవరో గుర్తిస్తే కేసు ఛేదించడం సులభమవుతుందని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కన్నీటిసంద్రం
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కుందారపు శ్రీనివాస్, ఆయన కుమార్తె దీక్షిత అంత్యక్రియలు వారి స్వగ్రామం రొంపికుంటలో జరిగాయి. మృతదేహాలకు మంచిర్యాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. జరిగిన ఘోరం గురించి తల్చుకుంటూ కంటతడిపెట్టుకున్నారు. తండ్రీకూతుళ్ల అంత్యక్రియలు కుటుంబసభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమె అంత్యక్రియలకు వెళ్లలేకపోయింది. కుమారుడు అజయ్రామ్ను బంధువులు గ్రామానికి తీసుకొచ్చి తండ్రి చితికి అతడితో నిప్పంటించారు. దీక్షత మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని చెప్పారు. ఆమె ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అజయ్‌రామ్‌కు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరామర్శ శ్రీనివాస్ కుటంబసభ్యులను పలువురు నాయకలు పరామర్శించారు. టీడీపీ మంథని నియెజకవర్గ ఇన్చార్జి కర్రు నాగయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగంటి భాస్కర్‌రావు, డీసీసీ ప్రధానకార్యదర్శి ఇనగంటి జగదీశ్వర్‌రావు, మంథని, కమాన్‌పూర్, పేద్దంపేట, రొంపికుంట సర్పంచ్‌లు పుట్ట శైలజ, కొంతం సత్యనారాయణ, తోట చంద్రయ్యలతోపాటు తదితరులు ఓదార్చారు. -
ఇక మాకు దిక్కెవరు
లింగాల, న్యూస్‌లైన్: మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురై.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కనుమూసిన గిరిజన మహిళ(35) మృతదేహాన్ని గురువారం ఆమె స్వగ్రామం కొత్త చెర్వుతండాకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని తండాకు తీసుకురాగానే మృతురాలి పిల్లలు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న పాయె, ఆలనాపాలనా చూసుకునే అమ్మ కూడా లేదాయె.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ ఆ చిన్నారులు విలపించిన తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. ఉపాధి కోసం వలస వెళ్లిన మృతురాలు ఈనెల 3న సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపూర్‌లో దుండగుల చేతిలో లైంగికదాడికి గురైన విషయం తెలిసిందే. 12రోజుల పాటు చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందింది. అక్కడే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు, స్థానికులు కొత్తచెర్వు తండాకు తీసుకొచ్చారు. చిన్నారుల రోదనను చూసి పలువురు చలించిపోయారు. తాము ఉన్నామని పలువురు ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ ఐదువేలు, అంబట్పల్లి సర్పంచ్ వాణి శంకర్ రూ.4,500 నగదు ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు అందజేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలి గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ మృతదేహంతో లింగాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బతుకుదెరువు కోసం పిల్లలతో వెళ్లిన గిరిజన మహిళ తిరిగి శవమై ఇంటికి రావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పిల్లలను ప్రభుత్వమే చదివించాలని ఆమె డిమాండ్ చేశారు. ర్యాలీలో సర్పంచ్ పల్లె నిరంజన్, బాలాజీ నాయక్, రాంజీనాయక్, గోపాల్‌నాయక్, తిర్పతయ్య, కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు భగవాన్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, టీడీపీ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై లైంగికదాడులు సిగ్గుచేటు మక్తల్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇంకా మహిళలపై లైంగికదాడులు జరుగుతుండటం సభ్య సమాజానికి సిగ్గుచేటని ఏపీసీఎల్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మక్తల్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక బాధితురాలు మృత్యువాతపడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌చేశారు.