లింగాల, న్యూస్‌లైన్: మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురై.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కనుమూసిన గిరిజన మహిళ(35) మృతదేహాన్ని గురువారం ఆమె స్వగ్రామం కొత్త చెర్వుతండాకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని తండాకు తీసుకురాగానే మృతురాలి పిల్లలు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న పాయె, ఆలనాపాలనా చూసుకునే అమ్మ కూడా లేదాయె.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ ఆ చిన్నారులు విలపించిన తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది.
ఉపాధి కోసం వలస వెళ్లిన మృతురాలు ఈనెల 3న సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపూర్‌లో దుండగుల చేతిలో లైంగికదాడికి గురైన విషయం తెలిసిందే. 12రోజుల పాటు చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందింది. అక్కడే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు, స్థానికులు కొత్తచెర్వు తండాకు తీసుకొచ్చారు. చిన్నారుల రోదనను చూసి పలువురు చలించిపోయారు. తాము ఉన్నామని పలువురు ఓదార్చారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ ఐదువేలు, అంబట్‌పల్లి సర్పంచ్ వాణి శంకర్ రూ.4,500 నగదు ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు అందజేశారు.
దుండగులను కఠినంగా శిక్షించాలి
గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ మృతదేహంతో లింగాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బతుకుదెరువు కోసం పిల్లలతో వెళ్లిన గిరిజన మహిళ తిరిగి శవమై ఇంటికి రావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పిల్లలను ప్రభుత్వమే చదివించాలని ఆమె డిమాండ్ చేశారు. ర్యాలీలో సర్పంచ్ పల్లె నిరంజన్, బాలాజీ నాయక్, రాంజీనాయక్, గోపాల్‌నాయక్, తిర్పతయ్య, కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు భగవాన్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, టీడీపీ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై లైంగికదాడులు సిగ్గుచేటు
మక్తల్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇంకా మహిళలపై లైంగికదాడులు జరుగుతుండటం సభ్య సమాజానికి సిగ్గుచేటని ఏపీసీఎల్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మక్తల్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక బాధితురాలు మృత్యువాతపడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌చేశారు.
ఇక మాకు దిక్కెవరు
Published Fri, Aug 16 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement