
ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయ నిర్మాణం
రెండేళ్లలో ఆస్పత్రి సిద్ధం.. హెలీప్యాడ్ కూడా..
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో 30 ఏళ్ల కల సాకారమవుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉస్మానియా ఆస్పతి భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆస్పత్రి నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఉస్మానియా ఆస్పత్రి.. అంతర్జాతీయ బ్రాండ్
అనంతరం గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. వివిధ రకాల కేసులు కోర్టుల్లో ఉండటం వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. అఫ్జల్‌గంజ్ ఉస్మానియా ఆస్పత్రి అంటే ఒక అంతర్జాతీయ బ్రాండ్..ప్రజల ఆరోగ్యానికి భరోసా, అటువంటి ఆస్పత్రిని ఈ ప్రాంతానికి దగ్గర్లోనే నిర్మించాలని గోషామహల్ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా 22 ఎకరాల్లో ఉందని, కొత్త భవన సముదాయానికి 26.32 ఎకరాలు కేటాయించామని, మరో 11 ఎకరాలు గ్రౌండ్ కోసం విడిచిపెట్టామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, రెసిడెన్స్, ఆడిటోరియం, అకాడమీ అని ఐదు భాగాలుగా విభజించామన్నారు.

రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేసి 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉస్మానియా సంబంధిత 9 ఆస్పత్రులు, మరో 8 కొత్త డిపార్ట్‌మెంట్లు కలిపి మొత్తం 40 విభాగాలు ఇక్కడ పనిచేస్తాయని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ వ్యయం రూ.2,700 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వైపులా విశాలమైన రహదారులు నిర్మిస్తామని, చిరు వ్యాపారులకు నష్టం లేకుండా అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాటసారులకు ఇబ్బందులు లేకుండా స్కై వాక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవల కోసం హెలీప్యాడ్‌ను నిర్మించనున్నామన్నారు. ఈ శాసనసభలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారని, వారందరికీ ఈ ఆస్పత్రిపై ఆరాటం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment