
కన్నీటిసంద్రం
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ కుందారపు శ్రీనివాస్, ఆయన కుమార్తె దీక్షిత అంత్యక్రియలు వారి స్వగ్రామం రొంపికుంటలో జరిగాయి. మృతదేహాలకు మంచిర్యాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. జరిగిన ఘోరం గురించి తల్చుకుంటూ కంటతడిపెట్టుకున్నారు. తండ్రీకూతుళ్ల అంత్యక్రియలు కుటుంబసభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమె అంత్యక్రియలకు వెళ్లలేకపోయింది.
కుమారుడు అజయ్‌రామ్‌ను బంధువులు గ్రామానికి తీసుకొచ్చి తండ్రి చితికి అతడితో నిప్పంటించారు. దీక్షత మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని చెప్పారు. ఆమె ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అజయ్‌రామ్‌కు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
పలువురి పరామర్శ
శ్రీనివాస్ కుటంబసభ్యులను పలువురు నాయకలు పరామర్శించారు. టీడీపీ మంథని నియెజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగంటి భాస్కర్‌రావు, డీసీసీ ప్రధానకార్యదర్శి ఇనగంటి జగదీశ్వర్‌రావు, మంథని, కమాన్‌పూర్, పేద్దంపేట, రొంపికుంట సర్పంచ్‌లు పుట్ట శైలజ, కొంతం సత్యనారాయణ, తోట చంద్రయ్యలతోపాటు తదితరులు ఓదార్చారు.