ఆలూ తింటే.. మధుమేహం ముప్పు
పిల్లలకి పొద్దున్నే భోజనంలోకి ఏం పెట్టాలి.. బంగాళాదుంప ఫ్రై. సాయంత్రం సరదాగా బయటకు వెళ్తే ఏం తినాలి.. ఫ్రెంచి ఫ్రైస్. ఇవి దాదాపు అన్ని కుటుంబాల్లోనూ కామన్‌గా కనిపిస్తాయి. కానీ, అలా తిన్నారంటే టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఏడుసార్లు లేదా అంతకంటే ఎక్కువగా బంగాళాదుంపలు తింటే మధుమేహం వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. రెండు నుంచి నాలుగుసార్లు తిన్నా కూడా 7శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉడకబెట్టిన బంగాళాదుంపల కంటే, ఫ్రెంచి ఫ్రైస్ మరింత దారుణమని అంటున్నారు. ఉత్త బంగాళాదుంపలు గానీ, ఫ్రెంచి ఫ్రైస్ గానీ తినేకంటే.. అన్నంలోగానీ, క్వినోవా, గోధుమల లాంటివాటితో కలిపి తింటే టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదం 12 శాతం తగ్గుతుందట.
చాలా దేశాల్లో బాగా అందుబాటులో ఉంటున్న బంగాళాదుంపలు.. ఆరోగ్యకరమైన ఆహారంలో మాత్రం భాగం కాదని ఒసాకా సెంటర్ ఫర్ కేన్సర్ అండ్ కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ప్రివెన్షన్‌కు చెందిన డాక్టర్ ఇసావో మురాకి చెప్పారు. బంగాళాదుంపల్లో స్టార్చ్ చాలా ఎక్కువగాను, పీచుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్ లాంటివి తక్కువగాను ఉంటాయని ఆయన వివరించారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే టైప్2 మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువని తెలిపారు. బంగాళాదుంపలను వేడిగా తింటే.. వాటిలో స్టార్చ్ సులభంగా జీర్ణం అయిపోయి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగా పెరుగుతుందని, ఇది మంచిది కాదని ఆయన విశ్లేషించారు.