డాక్టర్ రామారెడ్డి కన్నుమూత
అనపర్తి, న్యూస్‌లైన్:
వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పేదల పెన్నిధిగా పేరుగడించిన అనపర్తి శ్రీనివాసా నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి (66) గురువారం కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కేర్‌ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు డాక్టర్ జానకిరామారెడ్డి హైదరాబాద్ శ్రీనివాసా ఈఎన్టీ రీసెర్చ్ సెంటర్ అధిపతి. స్వగ్రామం అనపర్తిలో 35 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ రాము డాక్టర్‌గా పేరొందిన ఆయన మరణించారని తెలిసి ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆయన షిర్డీ ధర్మ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలువురు యువకులను చేరదీసి ఉపాధి కల్పించారు. ఆయన బాల్య స్నేహితుడు, నారాయణరెడ్డి కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన రాము డాక్టర్ మృతి తీరనిలోటని అన్నారు.
గంగిరెడ్డి నర్సింగ్‌హోమ్ అధినేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ యువ వైద్యులకు బాసటగా నిలిచిన డాక్టర్ రామారెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ రామారెడ్డి మృతిపై ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, తేతలి రామారెడ్డి, నియోజక వర్గ టీడీపీ ఇన్‌ఛార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి సహకార సంఘం అధ్యక్షుడు కర్రి రామారెడ్డి(రామన్నతాత), గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్లు గొలుగూరి బాపిరాజు, కర్రి ప్రవల్లిక శేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, అమ్మిరెడ్డి ఆయిల్స్ సంస్ధ ఎండీ సబ్బెళ్ల అమ్మిరెడ్డి, జీబీఆర్ విద్యా సంస్థల అధిపతి తేతలి ఆదిరెడ్డి(కొండబాబు), రాయవరం ఏరియా రైసుమిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నల్లమిల్లి సూరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డెరైక్టర్ కర్రి అప్పారావు(ఎర్రబ్బు), పట్టణ వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), కొవ్వూరి వెంకటరామారెడ్డి, సంఘం మాజీ అధ్యక్షులు తాడి వెంకటరామారెడ్డి, సత్తి విశ్వనాధరెడ్డి, సత్తి వెంటరామారెడ్డి, మల్లిడి సుబ్బారెడ్డి, నియోజక వర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు ద్వారంపూడి అర్జునరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి(కేఎస్ఆర్ సుధ), పట్టణ రెడ్డి అసోసియేషన్ యువజన విభాగం అధ్యక్షుడు తాడి చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వరామ్ శ్రీను, మల్లిడి ఆదినారాయణరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు) తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నేడు ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేత
డాక్టర్ రామారెడ్డి మృతికి సంతాప సూచకంగా శక్రవారం అనపర్తి, బిక్కవోలు, రాయవరం, జి.మామిడాడ గ్రామాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ అనపర్తి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామగుర్రెడ్డి, డాక్టర్ టి.నవీన్ తెలిపారు.
నేడు వ్యాపార సంస్థలు మూసివేత
డాక్టర్ రామారెడ్డి మృతికి సంతాపంగా పట్టణ పరిధిలో వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు) తెలిపారు. వ్యాపారులు సహకరించాలని కోరారు.
నేడు డాక్టర్ రామారె డ్డి అంతిమ యాత్ర
డాక్టర్ రామారెడ్డి అంతిమయాత్ర శుక్రవారం అనపర్తిలోని ప్రధాన రహదారుల గుండా సాగుతుందని జీబీఆర్ విద్యా సంస్ధల అధిపతి, డాక్టర్ రామారెడ్డి శిష్యుడు తేతలి ఆదిరెడ్డి(కొండబాబు) విలేకరులకు తెలిపారు. పాతవూరులో విష్ణాలయం వద్ద గల రామారెడ్డి స్వగృహం నుంచి ప్రారంభమయ్యే అంతిమ యాత్ర కర్రి అప్పారావు వీధి, నారయ్య నూతి వీధి, ఎర్రకాలువ వంతెన, పాత పెట్రోలు బంకు, గాంధీ నగర్, మార్కెట్ రోడ్డు, దేవీచౌక్ల మీదుగా శ్రీనివాసా నర్సింగ్ హోమ్‌కు చేరుతుందని తెలిపారు. అక్కడ కొద్దిసేపు ప్రజల దర్శనార్ధం రామారెడ్డి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్టు చెప్పారు. అనంతరం కుమ్మరవీధి, శివాలయం మీదుగా నల్లకాలువ వద్ద గల హిందూ శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేరుతుందన్నారు. అక్కడ అంత్యక్రియలు జరుగుతాయని కొండబాబు తెలిపారు.