potladurthi
-
వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు జలసమాధి
అనుకోని విషాదం ఇంటిల్లిపాదినీ పొట్టనబెట్టుకుంది. వరద రూపంలో కాటేసింది. నిశిరాత్రి..చుట్టూ నీళ్లు.. ముందుకు సాగని ఆటో.. చూస్తుండగానే పెరిగిపోయిన ప్రవాహం..ఏం జరుగుతుందో తెలిసేలోగానే జలం చుట్టుముట్టేసింది. రెక్కాడితే డొక్కాడని ఓపేద కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఆటో నడుపుతున్న వ్యక్తితోపాటు అతని తల్లి..భార్య..ముగ్గురు పిల్లలు వరదనీటిలో గల్లంతైన సంఘటన పోట్లదుర్తి దళిత వాడను కుదిపేసింది. కుందూనది వరద ఉధృతికి కామనూరు వంక వద్ద ఆరుగురు జలసమాధి అయిన సమాచారం విషాద సంద్రంలో ముంచింది. సాక్షి, కడప: సంతోషంగా సాగిపోతున్న వారి జీవన నావ వరదలో చిక్కుకుంది. కుటుంబమంతా జలసమాధి అయింది. అనూహ్యంగా పెరిగిన వరద ఉధృతి ఆరుగురిని కబళించింది. అందులో ముగ్గురు చిన్నారులు..అనుకోని సంఘటనతో గల్లంతైన ఆ కుటుంబం గురించి ఊరంతా కన్నీరు పెడుతున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దళితవాడకు చెందిన మల్లుగాళ్ల రామాంజనేయులు(30) చాలా కాలంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పెంచలమ్మ(25), పిల్లలు అంజలి(6) కార్తీక్(10 నెలలు) మేఘన(4)లతోపాటు అతని తల్లి సుబ్బమ్మ(60) కూడా వారితోనే ఉండేది. చిన్న మిద్దె ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు. అంజలి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతుండగా, మేఘనను సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి పంపేవారు. ఆర్థ్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవ్వడంతో ఫైనాన్స్ వ్యాపారి వద్ద వడ్డీకి రుణం తీసుకుని రెండు వారాల క్రితం ఆటో కొనుక్కున్నాడు. కొత్త ఆటో వచ్చిందని నలుగురికీ చెప్పి సంతోషపడేవాడు. ఈ నేపథ్యంలో దువ్వురు మండలం గొల్లపల్లెలోని మేనత్త ఇంట సోమవారం సీమంతం జరిగింది. శుభకార్యక్రమానికి సొంత ఆటోలో కుటుంబసభ్యులను తీసుకు వచ్చాడు. చీకటి పడినా అక్కడే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ రాత్రి ఇంటిలోనే ఉండిపోవాల్సిందిగా మేనత్త కుటుంబీకులు కోరారు. కానీ పొద్దున్నే మళ్లీ ఆటో తీసుకుపోకపోతే గాని నాలుగు డబ్బులు రావని భావించిన రామాంజనేయులు ఇంటికి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నాడు. రాత్రి 11గంటలు దాటిన తర్వాత తన కుటుంబ సభ్యులను ఆటో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే కొంత వర్షం పడుతోంది. ఒకపక్క చిమ్మచీకటి..మరోపక్క వర్షం జోరు. ఇంటికి తొందరగా వెళ్లిపోదామనే ధీమాతో రామాంజనేయులు ఆటో పోనిచ్చాడు. సమీపంలోని గ్రామస్తులు ఆటోలో వెళ్తున్న వీరిని ముందుకు పోవద్దని వారించినట్లు తెలిసింది. ప్రొద్దుటూరు సమీపంలోని కామనూరు వంక వద్ద రాగానే వరద నీటిలో ఆటో చిక్కుకొని బోల్తా పడింది. సుబ్బమ్మ, చిన్నారితో పాటు పసికందు నీళ్లలో పడిపోయి కనిపించకుండా పోయారు. కుమార్తెను ఎత్తుకొని రామాంజనేయులు, అతని భార్య పెంచలమ్మ వరద నీటిలో ఎటూ కదల్లేకపోయారు. ఆటో బోల్తా పడిన విషయం తెలియడంతో స్థానికులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులుకూడా వచ్చారు. చీకటిలో ఏమీ కనిపించడం లేదు. వంక దిగువ నుంచి కాపాడండి.. అనే శబ్దంతో పాటు చిన్నారి ఏడుపు వినిపించిందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు లైట్లు వేసి చూడగా దూరంగా చిన్నారిని ఎత్తుకొని ఒక వ్యక్తి కనిపించారు. మోటారు పైపును పట్టుకొని మరో మహిళ నీళ్లలో చిక్కుకుంది. కుమార్తెనైనా బతికించుకోవాలనే తాపత్రయంతో అతను నీటి ఉధృతిలోనే సుమారు రెండున్నర గంటల పాటు ఎదురొడ్డి పోరాడాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్రమంగా వరద ఉధృతి పెరిగిపోయింది. చిన్నారితో పాటు భార్యాభర్తలు కనిపించలేదు. వారిని కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత ఆటో గల్లంతు అయిన సంఘటన బయటపడినా అందులో ఉన్నవారెవరో తెలియలేదు. ముగ్గురు గల్లంతయ్యారని భావించారు. రామాంజనేయులు అత్తగారి ఊరు మైదుకూరు మండలం ఉత్సలవరం. సోమవారం రాత్రికి వారి ఆటో పోట్లదుర్తికి రాకపోవడంతో ఉత్సలవరానికి వెళ్లింటారని ఊళ్లో బంధువులు భావించారు. బుధవారం బంధువులు అనుమానంతో గొల్లపల్లెలోని తెలిసినవారికి ఫోన్ చేశారు. సోమవారం రాత్రే ఆటోలో వెళ్లిపోయారని చెప్పారు. రామాంజనేయులు అన్న రామకృష్ణతో పాటు బంధువులు రూరల్ పోలీసులను సంప్రదించడంతో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసింది. రామాంజనేయులుకు నలుగురు సంతానం . మొదటి కుమారుడు ప్రమాదశాత్తూ ఆరేళ్ల క్రితం గోడకూలి మృతి చెందాడు. కూలి పని చేసుకుని జీవించే కుటుంబం జలసమాధి కావడం అందరినీ కలచివేసింది. పోట్లదుర్తిలోని దళితవాడలో వారి ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి కన్నీమున్నీరుగా విలపించారు. రబ్బరు బోట్లు, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో గాలింపు కామనూరు వంకలో గల్లంతైన వారి కోసం రెండో రోజు గాలింపు చర్యలు చేపట్టారు. రబ్బరు బోట్లతో అగ్నిమాపక రెస్క్యూ టీం ఒక వైపు, కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు మరో వైపు గాలిస్తున్నారు. మంగళవారం చీకటి పడే వరకు వెతికినా వారి ఆచూకి తెలియలేదు. డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐలు, అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ గాలిస్తున్నారు. కుందూ తీరప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వద్దురా అంటున్నా వినలేదు... రాత్రి అయింది ..పొద్దున్నే పోదులేరా అని చెప్పినా.. ఏముందిలే అక్క ..బస్సులో కాదు కాద.. మన ఆటోలో పోతాంలే అంటూ బయలు దేరాడు. వరద నీటిలో గల్లంత అయినారు అని విషయం తెలిసింది. మేం ఒక ఆటోలో సీమంతానికి వెళ్లాం..రాతిర నీళ్లొచ్చాయి.. అని కూడా చెప్పాం. వినకుండా వెళ్లారు. భగవంతుడు ఇలా విషాదాన్ని మిగులుస్తాడని అనుకోలేదు. – సుభాషిణి .. రామంజనేయులు సోదరి, పోట్లదుర్తి -
చట్టం.. వారికి చుట్టం
సాక్షి, కడప : అవి కుల వృత్తులు చేసుకుంటూ జీవించే నిరుపేదలకు దక్కాల్సిన సర్వీస్ ఇనాం భూములు. ఎంతో విలువైనవి కావడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబీకుల కన్ను పడింది. ఇంకేముంది....తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చట్టాన్ని చుట్టచుట్టి ప్రక్కన పెట్టి వాటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్వం గ్రామాల్లో కుల వృత్తులు ఉండేవి. ప్రజలకు ఆయా సేవలు అందించే వీరి జీవనోపాధి కోసం అప్పటి రాజులు కొన్ని భూములను ఇనాములుగా కేటాయించారు. కుల వృత్తి నిర్వహిస్తున్నంత కాలం ఆ భూములను సాగు చేసుకునే హక్కు వారికి ఉంటుంది. వీటిని సర్వీసు ఇనాములుగా పరిగణిస్తారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో కూడా ఇలాంటి సర్వీస్ ఇనాం భూములు ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన చరణ్‌తేజ నాయుడు సతీమణి జ్యోతి తేజస్వి కొన్ని సర్వే నెంబర్లలోని 12ఎకరాల 60 సెంట్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం కన్వర్షన్ ఫీజు కింద రూ.3,74,814 చెల్లిస్తూ 2015 నవంబరు 20వ తేదిన చలానాలు కట్టారు. ప్రభుత్వ బేసిక్ వాల్యూ ప్రకారం ఎకరా 3,30,000 రూపాయలు చేస్తుంది. బహిరంగ మార్కెట్లో అనధికారికంగా ఈ భూముల విలువ ఇంకా అధికంగానే ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఈ ఫైలు అప్పటి కలెక్టర్ కేవీ రమణ వద్దకు వెళ్లింది. రీ సర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిష్టర్ ప్రకారం అర్జీదారు పొందుపరిచిన సర్వే నెంబర్లలో కొన్ని పట్టా భూములు కాగా, మరికొన్ని సర్వీస్ ఇనామ్ భూములు ఉన్నాయని కలెక్టర్ గుర్తించారు. సర్వీస్ ఇనాం భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం వీలు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గవర్నమెంటు అమెండ్మెంట్ యాక్ట్, 16/2013 ప్రకారం సర్వీస్ ఇనాం భూములు బదలాయించరాదని పేర్కొంటూ ఆ ప్రతిపాదనలు తిరస్కరించారు. పట్టా భూములు ఉన్నట్లయితే పరిశీలించి కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలంటూ కలెక్టర్ 2015 డిసెంబరు 14వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. బదలాయించిన భూములు దరఖాస్తుదారు ప్రతిపాదించిన సర్వే నెంబర్లలో మొత్తం 13.15 ఎకరాల భూమి ఉండగా, అందులో 12.62 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ 2016 జనవరిలో అప్పటి ఆర్డీఓ చిన్నరాముడు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులోని సర్వే నెంబరు 840, 841, 847, 849, 851, 859లలోని భూములు ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వీస్ ఇనాంలు. ఎంతో విలువైన ఇలాంటి భూములు అక్రమార్కుల పాలిట కాకుండా రెవెన్యూ ఉన్నతాదికారులు, విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు దరఖాస్తుదారైన జ్యోతి తేజస్వి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు స్వయాన అన్న సురేష్నాయుని కోడలు. తమకున్న రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి ఎర్రగుంట్ల తహసీల్దార్ హడావుడిగా 2015 డిసెంబరు 31వ తేది పై అధికారులకు నివేదిక పంపారు. భూమి బదలాయింపు ప్రతిపాదన ఫైలు తిప్పి పంపిన కలెక్టర్ కేవీ రమణ నెలన్నర రోజులకే మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఏపీ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్–2006 ప్రకారం సదరు ప్రతిపాదనల ఆమోదానికి చర్యలు చేపట్టాలని 2016 జనవరి 30వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఒక అధికారి చట్టంలోని నిబంధనలను పేర్కొంటూ తిరస్కరించిన ప్రతిపాదనలను అప్పీలేట్ అథారిటీ రద్దు చేయవచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండానే కలెక్టర్ తాను తిరస్కరించిన ప్రతిపాదనలను తానే ఆమోదం తెలుపడం వెనుక చాలా కథే నడించిదంటున్నారు. ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ కలెక్టర్ కడప ఆర్డీఓకు జారీ చేసిన ఉత్తర్వుల్లోని సూచికలో గతంలో అదే ఫైలును ఎందుకు తిరస్కరించిందీ, ఇప్పుడు ఎందుకు ఆమోదించారో కారణాలు తెలుపకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదంటే అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు పనిచేశాయో అర్థమవుతోంది. ఈ సందర్బంగా గుర్తొచ్చే విషయం ఏంటంటే గతంలో ఇదే పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఛార్జెస్ ఫేమ్ అయ్యాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలు తహసీల్దార్ వరకు పది మందిపై అభియోగాలు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
పోట్లదుర్తి బ్రదర్స్ అరాచకం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలోని పోట్లదుర్తి బ్రదర్స్ ఎంపీ రమేష్ , సురేష్‌నాయుడుల అరాచకం ఎక్కువైందని, వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని బెదిరిస్తూ..భయపెడుతున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎన్నికల రోజున వైఎస్సార్సీపీ తరుపున 248 పొలింగ్ కేంద్రం ఏజెంటుగా కుర్చున్న దివ్యాంగుడు సంగాల రామ్మోహన్‌రెడ్డి టీడీపీ వారి నకిలీ ఓటర్లను అడ్డుకున్నాడు. దీంతో ఎంపీ రమేష్, సురేష్‌లు బెదిరించి రామ్మోహన్‌రెడ్డి ఇంటికి తాళం చేసి కాలి చేసి వెళ్లిపోవాలని భయపెట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త , అసెంబ్లీ అభ్యర్థి డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి వెంటనే రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వేసిన తాళం తీయించాలని లేకపోతే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటుందని పోలీసులకు చెప్పారు. అనంతరం టీడీపీ వారు వేసిన తాళం తీసి వేశారు. ఈ విషయంపై దివ్యాంగ బా«ధితుడు సంగాల రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోట్లదుర్తి గ్రామంలో 2002 సంవత్సరంలో తన తల్లి చెన్నమ్మ పేరు మీద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసిందన్నారు. అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వకుండా టీడీపీ నేత సురేష్‌నాయుడు వద్దనే ఉంచుకున్నారని చెప్పారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గ్రామంలోని 248 పొలింగ్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ తరుపున ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరుపున ఏజెంట్‌గా కూర్చున్నానని చెప్పారు. సాయంత్రం సమయంలో టీడీపీ వారు నకిలీ ఓటర్లును పంపించారని, ఆ నకిలీ ఓట్లును అడ్డుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఆదే బూత్‌లో ఉన్న ఎంపీ రమేష్ అనుచరుడు గొవింద పక్కనే ఉన్న టీడీపీ ఏజెంట్‌తో ఫోన్ చేయించి మీ ఇంటికి తాళం వేస్తున్నారని బెదిరించారన్నారు. అయినా భయపడకుండా 13 నకిలీ ఓటర్లును అడ్డుకొని బయటకు పంపించినట్లు చెప్పారు. మా అమ్మ చెన్నమ్మ పేరు మీద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసినా ఆ ఇంటి పత్రాలు మాకు ఇవ్వకుండా సురేష్‌నాయుడు వద్దనే ఉంచుకున్నారు. వారికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇలా బెదిరింపులకు దిగుతారని చెప్పారు. సురేష్‌నాయుడు గతేడాది కూడా మా అక్క, బావను ఇంటి వద్దకు పిలిపించుకొని చిత్రహింసలు పెట్టి కొట్టారన్నారు. అప్పటి నుంచి నేను వారికి వ్యతిరేకంగా ఉండి వైఎస్సార్ సీపీ తరుపున ఈ ఎన్నికలలో ఏజెంట్‌గా కూర్చున్నట్లు తెలిపారు. పోట్లదుర్తి బ్రదర్స్ అరాచకాలను నుంచి మమ్మల్ని కాపాడి మా ఇంటి పత్రాలు మాకు ఇప్పించాలని పోలీసులను కోరారు. అ కాలనీలో నివాసం ఉంటున్న అందరి పరిస్థితి కూడా ఇలానే ఉందన్నారు. మా పార్టీ కార్యకర్తకు ఏదైన జరిగితే ఊరుకోం వైఎస్సార్సీపీ కార్యకర్త రామ్మోహన్‌రెడ్డికి ఏదైన జరిగితే చూస్తే ఊరుకోమని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలుసుకుని శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి శివాలయంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డితో కలసి పూజలు నిర్వహించారు. అప్పటికే ఎర్రగుంట్ల సీఐ వెంకటరమణ ప్రత్యేక పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. రామ్మెహన్‌రెడ్డి ఇంటికి వేసిన తాళం వెంటనే తీయాలని సీఐకి చెప్పారు. గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ అరాచాలతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఒక్కసారి ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తే ఆ ఇంటిపై హక్కు బాధితులకు ఉంటుంది తప్ప పోట్లదుర్తి బ్రదర్స్ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. -
పోట్లదుర్తిలో జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ డాబా సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు..ఎర్రగుంట్ల పట్టణంలోని ఎర్రబ్బచేను దగ్గర దర్గా సమీపంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణ (28)మంగళిషాపులో పని చేస్తూ, మరో వైపు డ్రైవర్‌గా పోతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రొద్దుటూరులోని తన బంధువులు చనిపోగా ఆ ఇంటిలో దీపం చూడడానికి సోమవారం స్కూటర్‌పై బయలుదేరాడు. ప్రొద్దుటూరుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పోట్లదుర్తి గ్రామ సమీపానికి రాగానే పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రామక్రిష్ణ తల పగలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పోట్లదుర్తిలో భారీ ఆగ్ని ప్రమాదం
పది గడ్డివాములు దగ్ధం సుమారు రూ.5 లక్షల నుంచి 6లక్షలు దాకా నష్టం ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రెడ్డిగారి వీధిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది గడ్డివాములు దగ్ధమయ్యూరుు. ఎస్. కులాయిరెడ్డి, పడిగపాటి వెంకటరెడ్డి, సురేష్‌రెడ్డి, గంగిరెడ్డి, వీరారెడ్డి, నంద్యాల సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి అనే రైతులకు చెందిన గడ్డివాములు ద గ్ధం అయ్యూరుు. సుమారు రూ. 5 లక్షల నుంచి 6లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ఆర్టీపీపీ, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు నుంచి ఆగ్నిమాపక సిబ్బంది వ చ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వరి గడ్డి పూర్తి వాములు కాలిపోయూరుు. స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది సోదరుడు జయరామిరెడ్డి రైతులను పరామర్శించారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఫోన్ లో ఈ ఘటనపై మాట్లాడారు. ఎమ్మెల్యే కలెక్టరుతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహార విషయంలో రైతులను ఆదుకుంటామని చెప్పారని అన్నారు. మహిళ కు గాయూలు పోట్లదుర్తిలో గడ్డి వాములు కాలిపోతున్నాయని విషయం అందగానే మహిళా రైతు బి.వరలక్ష్మి సంఘటనా స్థలానికి పోతున్న సమయంలో మలుపు వద్ద క్రాస్ అవుతున్న ఫైర్ ఇంజన్ తగిలింది. వెంటనే స్థానికులు పక్కకు లాగేశారు. కాలుకు మాత్రం పెద్ద గాయం అయింది. వెంటనే స్థానికులు ట్రాక్టరులో ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెద్దముడియంలో... పెద్దపసుపుల గ్రామంలో సోమవారం సాయంత్రం మూడు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. రామచంద్రా రెడ్డి అనే రైతుకు చెందిన వాములు రెండు, వీరారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఒక గడ్డి వామి అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని 6గామస్తులు చెబుతున్నారు. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ఆర్ఐ కొండయ్య, వీఆర్ఓలు పుల్లయ్య, కొండల్రావు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. జమ్మలమడుగు నుంచి ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.