పౌల్ట్రీకి ప్రాణం
సిద్దిపేట అర్బన్: పౌల్ట్రీరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెతుకుసీమది రెండోస్థానం. రంగారెడ్డి జిల్లా తర్వాత కోళ్ల ఫారాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న జిల్లా. గడచిన పదేళ్లలో పౌల్ట్రీ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి రూ.1,116 కోట్ల వరకు పౌల్ట్రీ వ్యాపారం సాగుతోంది. జిల్లాలో 80 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బాయిలర్ ఫారాలు 2 వేల వరకు ఉన్నాయి. ఇక 70 లక్షల సామర్థ్యం కలిగిన లేయర్ ఫారాలు 70, 5 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బ్రీడర్ పౌల్ట్రీ ఫారాలు జిల్లాలోని వివిధ చోట్ల ఉన్నాయి. పౌల్ట్రీరంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
నిర్వహణ ఖర్చులతో కుదేలు
ఒకప్పుడు కాసులు కురిపించిన పౌల్ట్రీ రంగం రానురాను సంక్షోభంలో కూరుకుపోయింది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో పాటు విద్యుత్ ఛార్జీలు, తరచూ దాణా ధరల పెరుగుదల వంటివి ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు, రైతులు, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడ్డాక పౌల్ట్రీ సమాఖ్య ప్రతినిధులంతా మరోమారు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పౌల్ట్రీని గట్టెక్కించేందుకు ఈ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా తన తొలి బడ్జెట్లోనే నిధులు సైతం కేటాయించారు.
పౌల్ట్రీరంగం ఎదుర్కొన్న సమస్యలు
కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, చేపల మిశ్రమం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దాణాను ప్రభుత్వరంగ సంస్థల నుంచి కాకుండా మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో వారు కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేశారు. దీంతో కోళ్ల ఫారాల రైతులపై అదనపు భారం పడింది.
సాధారణంగా కోళ్ల ఫారాలకు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో విద్యుత్ శాఖ కోళ్ల ఫారాలను మూడో విభాగం కింద చేర్చి యూనిట్‌కు రూ. 6.08 ఛార్జీలు వసూలు చేస్తోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ. 2 చొప్పునే చెల్లించే వెసులుబాటు కల్పించడంతో పాటు కోళ్ల ఫారాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. ఈ విధంగా మనదగ్గర లేకపోవడంతో నిర్వహణ వ్యయం పౌల్ట్రీ నిర్వాహకులకు భారంగా మారుతోంది.
వ్యవసాయ హోదాతో కలిగే లాభాలు
ప్రభుత్వం ప్రస్తుతం కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వడంతో చాలా వరకు కష్టాలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది.
విద్యుత్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనిట్ కరెంటుకు రూ. 6.08 చెల్లిస్తున్న పౌల్ట్రీ రైతులు, ఇక నుంచి రూ.3 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
పభుత్వ రంగ సంస్థల నుంచే దాణాలో వినియోగించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశంతో పాటు సబ్సిడీలు పొందే వీలుంటుంది.
నిర్వహణ భారం తగ్గడం వల్ల ఫారాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దవచ్చు. దీంతో కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు, దుర్వాసన వంటి అసౌకర్యాలూ తొలగిపోతాయి.
వ్యవసాయ హోదా వల్ల ఔత్సాహికులు ఫారాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పౌల్ట్రీ వృద్ధికి దోహదపడడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కూడా మెరుగవుతుంది.
జిల్లా ఇదీ పరిస్థితి
జిల్లాలో కోళ్ల పరిశ్రమకు మంచి ఆదరణ ఉండడంతో పాటు రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాలలో ఎక్కువ సంఖ్యలో కోళ్ల ఫారాలు వెలిశాయి. కేవలం బ్రూడర్ కోళ్ల ఫారాలు సిద్దిపేటలో మాత్రమే ఉన్నాయి. మిగితా కొన్ని చోట్ల లేయర్స్ ఫారాలు ఉండగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బాయిలర్స్ ఫారాలను రైతులు నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకూ జిల్లా నుంచి కోళ్లు, గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ఇతర జిల్లాలకు సిద్దిపేట నుంచి పిల్లలను తరలిస్తున్నారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించడం పట్ల అందులో పని చేసే కూలీలు కూడా తమకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది.