సాక్షి, భీమవరం/అమరావతి: పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. కోడి గుడ్డు రైతు ధర రూ.5.79కు చేరి పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా.. పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్‌లో గుడ్డు రూ.7కు చేరింది. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.
60 శాతం ఉత్తరాదికి ఎగుమతి
రాష్ట్రంలో 2 వేలకు పైగా కోళ్లఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సగటున 4.20 కోట్ల నుంచి 4.75 కోట్ల మధ్య గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 40 శాతం స్థానికంగానే వినియోగిస్తుండగా.. మిగిలిన 60 శాతం బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
శీతల ప్రభావం ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి ముఖ్య సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ సీజన్‌లో అత్యధిక ధర నమోదవుతుంటుంది. 2017–18 సీజన్‌లో రూ.5.45 అత్యధిక ధర నమోదైంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో సీజన్ కలిసి రాక రైతు ధర రూ.5 దాటడం గగనంగా ఉండేంది.
చరిత్రలో ఇదే గరిష్ట ధర
ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పడటంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి నాలుగేళ్ల తర్వాత 2022–23 పౌల్ట్రీ సీజన్‌లో రూ.5.57 గరిష్ట ధర పలికింది. కాగా.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో ధరలో ఒడిదొడుకులు ఎదురైనా.. వారం, 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం రూ.5.79కి చేరి అల్‌టైమ్ రికార్డు నమోదైంది. కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో స్థానిక వినియోగం మరింత పెరగనుండటంతో ఫామ్ గేట్ వద్ద ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
నూకలు దొరకట్లేదు
పౌల్ట్రీ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే నూకలు టన్ను రూ.13 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు చేరింది. నూకలను ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తుండటంతో మార్కెట్‌లో దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నూకలకు బదులు మొక్కజొన్నపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మొక్కజొన్న కూడా టన్ను రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. సోయాబీన్ టన్ను రూ.48 వేల నుంచి రూ.50 వేల మధ్య పలుకుతోంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది.
పెరిగిన మేత ధరలతో పాటు మందులు, వ్యాక్సిన్ల ధరలు, కార్మికుల జీతాలు పెరగడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచేసింది. ఫలితంగా పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి గతేడాది రూ.300–310 ఖర్చు కాగా.. ప్రస్తుతం రూ.360–370 ఖర్చవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.7, మారుమూల పల్లెల్లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రైతు ధరకు 40–50 పైసలు అదనంగా చేర్చి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment