pound sterling
-
పౌండు చరిత్రాత్మక పతనం..
బిలియనీర్ ఇన్వెస్టరు జార్జ్ సరోస్ అంచనాలకు అనుగుణంగానే అమెరికా డాలరుతో బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 11 శాతం పతనమయ్యింది. క్రితం రోజు 1.5 డాలర్లకు ఒక పౌండు లభించేది. తాజాగా 1.32 డాలర్లకే వచ్చేంతగా విలువ తగ్గిపోయింది. ఈ మారకపు విలువ 1970వ దశకంలో పౌండు ట్రేడింగ్ కరెన్సీగా మారిన తర్వాత ఇంతలా పతనం కావడం ఇదే ప్రధమం. పైగా గురువారం ప్రపంచంలో అధికంగా నష్టపోయిన కరెన్సీ ఇదే. యూరోతో పోలిస్తే పౌండు 6 శాతం నష్టపోయింది. పౌండు బేర్‌గా ప్రసిద్ధిగాంచిన జార్జ్ సరోస్ పాతికేళ్ల క్రితం 1992లో ఈ పతనాన్ని అంచనావేసి ఒక బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించారు. బ్రెగ్జిట్ జరిగితే పౌండ్ భారీగా పతనమవుతుందంటూ రెండు రోజుల క్రితమే సరోస్ వెల్లడించిన అభిప్రాయాన్ని పలు ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తోసిపుచ్చాయి. అయితే చివరకు ఆయన అంచనాలే నిజమై, 1992లో జరిగిన పతనంకంటే ఈ దఫా మరింత ఎక్కువగా పౌండు పడిపోయింది. సరోస్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. బ్రిటన్ వైదొలిగితే యూరో విలువతో కూడా పౌండు పతనమై, కొద్ది రోజుల్లో యూరోతో సమానమైపోతుందని, ఇది బ్రిటన్వాసులు ఇష్టపడని పరిణామమని అన్నారు. -
31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పౌండ్ విలువ
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్‌లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. నిన్నటి వరకు పౌండుకు 1.50 డాలర్లు వస్తే, ఇప్పుడు కేవలం 1.35 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. రూపాయి విలువతో పోల్చి చూసినపుడు కూడా పౌండు విలువ పడిపోయింది. నిన్నటి వరకు సుమారుగా ఒక పౌండుకు 98-99 రూపాయల వరకు వస్తుండగా, ఇప్పుడు 91.34 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటిషర్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా గట్టిగానే కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోగా జపాన్ మార్కెట్లలో అయితే 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.