పౌండు చరిత్రాత్మక పతనం..
బిలియనీర్ ఇన్వెస్టరు జార్జ్ సరోస్ అంచనాలకు అనుగుణంగానే అమెరికా డాలరుతో బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 11 శాతం పతనమయ్యింది. క్రితం రోజు 1.5 డాలర్లకు ఒక పౌండు లభించేది. తాజాగా 1.32 డాలర్లకే వచ్చేంతగా విలువ తగ్గిపోయింది. ఈ మారకపు విలువ 1970వ దశకంలో పౌండు ట్రేడింగ్ కరెన్సీగా మారిన తర్వాత ఇంతలా పతనం కావడం ఇదే ప్రధమం. పైగా గురువారం ప్రపంచంలో అధికంగా నష్టపోయిన కరెన్సీ ఇదే. యూరోతో పోలిస్తే పౌండు 6 శాతం నష్టపోయింది.
పౌండు బేర్‌గా ప్రసిద్ధిగాంచిన జార్జ్ సరోస్ పాతికేళ్ల క్రితం 1992లో ఈ పతనాన్ని అంచనావేసి ఒక బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించారు. బ్రెగ్జిట్ జరిగితే పౌండ్ భారీగా పతనమవుతుందంటూ రెండు రోజుల క్రితమే సరోస్ వెల్లడించిన అభిప్రాయాన్ని పలు ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు తోసిపుచ్చాయి. అయితే చివరకు ఆయన అంచనాలే నిజమై, 1992లో జరిగిన పతనంకంటే ఈ దఫా మరింత ఎక్కువగా పౌండు పడిపోయింది. సరోస్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. బ్రిటన్ వైదొలిగితే యూరో విలువతో కూడా పౌండు పతనమై, కొద్ది రోజుల్లో యూరోతో సమానమైపోతుందని, ఇది బ్రిటన్‌వాసులు ఇష్టపడని పరిణామమని అన్నారు.