31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పౌండ్ విలువ | pound sterling plunges to 31 year low after brexit decision | Sakshi
Sakshi News home page

31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పౌండ్ విలువ

Published Fri, Jun 24 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పౌండ్ విలువ

31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పౌండ్ విలువ

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి.

నిన్నటి వరకు పౌండుకు 1.50 డాలర్లు వస్తే, ఇప్పుడు కేవలం 1.35 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. రూపాయి విలువతో పోల్చి చూసినపుడు కూడా పౌండు విలువ పడిపోయింది. నిన్నటి వరకు సుమారుగా ఒక పౌండుకు 98-99 రూపాయల వరకు వస్తుండగా, ఇప్పుడు 91.34 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటిషర్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా గట్టిగానే కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోగా జపాన్ మార్కెట్లలో అయితే 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement