మేమూ రెఢీ
కర్నూలు(జిల్లా పరిషత్): కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు గ్రామ జనాభా వెయ్యి. ఈ గ్రామ పంచాయతీకి విద్యుత్ అధికారులు రూ.26 లక్షలకు పైగా బిల్లు వేశారు.
బి.తాండ్రపాడు గ్రామంలో వీధిదీపాలకు కరెంటు తీశారు. నాలుగు రోజులుగా కరెంటు లేకపోవడం వల్ల నడవలేకపోతున్నాము. లద్దగిరి, గోరంట్ల, మార్కాపురం కొట్టాల, హుసేనాపురం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
10 ఏళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లులను ఒక్కసారిగా వడ్డీ, సర్‌చార్జిలతో కట్టాలనడం న్యాయమా..?
అధిక శాతం పంచాయతీల్లో మీటర్లు లేవు. అలాంటప్పుడు ఎలా లెక్క కట్టి బిల్లు వేస్తారు.
మీ లెక్క మీకుంటే మా లెక్క మాకుంది. పంచాయతీ పరిధిలోని స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు ముందు పన్ను కట్టండి. ఆ తర్వాత లెక్కలు తేల్చుకుందాం. అప్పుడు ఎవరు బిల్లు కట్టాలో తేలుతుంది.
ఇలా జిల్లాలోని సర్పంచులందరూ సంయుక్తంగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. స్మార్ట్‌సిటి, స్మార్ట్‌విలేజ్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక శాతం సర్పంచులు విద్యుత్ బిల్లులపై ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లుల అంశం తేల్చాలని జిల్లా కలెక్టర్‌తో పట్టుబట్టారు. ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ఈ విషయాన్ని సమావేశంలో లేవనెత్తారు.
విద్యుత్ బిల్లులను పంచాయతీలకు వచ్చే 13వ ఫైనాన్స్ నిధుల నుంచి ఎలా చెల్లిస్తాయని ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌గా మీరు ఆర్డర్ ఇచ్చినందు వల్లే విద్యుత్ అధికారులు పంచాయతీలపై పడ్డారన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన బకాయిలను వడ్డీ, సర్‌చార్జి పేరుతో లక్షల రూపాయలను చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
ఎక్కడా విద్యుత్ మీటర్లు లేవని, అలాంటప్పుడు ఎలా లెక్కిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై కలెక్టర్ మాట్లాడుతూ బిల్లులు చెల్లించాలని తాను ఆర్డర్ ఇవ్వలేదని చెప్పారు. విద్యుత్ సంస్థ వారు కూడా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కొనాల్సి ఉంటుందని, వారికీ ఖర్చులుంటాయని, బిల్లులు చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆ బిల్లులు పంచాయతీలు చెల్లించాలని చెప్పడం సరికాదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా అధికారాలతో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు సైతం పన్నులు వేస్తామని, ఆ తర్వాత లెక్కలు తేలిస్తే ఎవరెంత చెల్లించాలో తేలుతుందన్నారు. ముందుగా సగం బిల్లులైనా చెల్లిస్తే, కనెక్షన్ తొలగించవద్దని తాను విద్యుత్ అధికారులకు చెప్తానని కలెక్టర్ అన్నారు. ఇష్టం లేకపోతే మీరూ(సర్పంచులు) మీ కమిషనర్(పంచాయతీరాజ్ కమిషనర్) తేల్చుకోవాలని కలెక్టర్ ముక్తాయించారు.
ప్రభుత్వం లోబడ్జెట్‌లో ఉంది అర్థం చేసుకోవాలి...!
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, లో బడ్జెట్లో ఉందని, ఈ మేరకు సర్పంచులు సైతం సహకరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లుల సమస్య రాష్ట్రమంతా ఉందని, మీరంతా కలెక్టర్‌ను ప్రశ్నిస్తే ఎలాగన్నారు. తాము కూడా 53 సీపీడబ్ల్యు స్కీమ్‌లకు జెడ్పీ నిధుల నుంచే బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఇది తమకు కూడా భారంగా ఉందని ఆయన చెప్పారు.
సునయన ఆడిటోరియంలో జరిగిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ విలేజ్, స్మార్ట్‌సిటి కార్యక్రమాన్ని విజయవంతం కావాలంటే అందరి సహకారం ఉండాలన్నారు. ప్రతి సర్పంచు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో మరిన్ని ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మూడు నెలల్లో గ్రామాల్లో మార్పు రావాలి
వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల్లో మార్పు రావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల తర్వాత కూడా బహిరంగ మల, మూత్రవిసర్జన గురించి మాట్లాడుకోవడం సరికాదన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచించి స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
సామూహిక మరుగుదొడ్ల వల్ల ఇబ్బందులున్నాయని, వ్యక్తిగత మరుగుదొడ్లకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలో ఉల్లి నిల్వలకు గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో బీఆర్ ఈశ్వర్, సీపీవో ఆనందనాయక్, డీపీవో శోభాస్వరూపరాణి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇన్చార్జి ఎస్ఈ జయచంద్రుడు పాల్గొన్నారు.