power centers
-
తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య..!
ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని తెలంగాణ బీజేపీ మాంచి జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా ఎంపీలయ్యారు. ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. ఇంత జోష్‌లో ఉన్న బీజేపీ నేతలు, క్యాడర్‌కు ఓ ఇబ్బంది ఎదురవుతోంది. కొత్త ఎంపీలు, కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్ర నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? శ్రేణులకు నాయకులు ఇచ్చిన భరోసా ఏంటి?తెలంగాణలో బీజేపీ ఫేస్‌గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. మోదీ రెండో కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డికి ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్‌కు కూడా కేంద్ర కేబినెట్లో పదవి దక్కింది.ఇప్పుడు బీజేపీకి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళతో పాటుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్యను భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవర్ సెంటర్స్ పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.కేంద్రంలోను, రాష్ట్రంలోను కమలం పార్టీ నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమెటిక్‌గా పార్టీలో పవర్ సెంటర్స్ కూడా పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథిగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ అనే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా బండి సంజయ్ మనిషిగా ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే భవిష్యత్‌లో పొలిటికల్ కేరీర్‌కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా నేత మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కవేమోననే భయం క్యాడర్‌ను పట్టి పీడిస్తోంది.కాషాయ సేనకు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంతా పైకి బాగానే ఉంటారు. తామంతా ఒక్కటే అన్నట్లుగానే కనిపిస్తారు. కాని ఒకరి కంటే ఒకరు ముందుండాలని, పార్టీలో పట్టు సాధించాలని తపన పడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కీలక నాయకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్య నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్‌ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. -
Russia-Ukraine war: క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు తీవ్రతరం చేసింది. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై గురి పెట్టింది. లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రావిన్స్‌లతోపాటు రాజధాని కీవ్, లీవ్‌పైనా క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. ‘‘గురువారం సాయంత్రం నుంచి 71 క్రూయిజ్ క్షిపణులను, 35 ఎస్–300 క్షిపణులను, 7 షహెడ్ డ్రోన్లను ప్రయోగించారు. 61 క్రూయిజ్ మిస్సైళ్లు, 5 డ్రోన్లను కూల్చేశాం’’ అని చెప్పింది. విద్యుత్ వ్యవస్థలపై దాడులతో కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఖర్కీవ్‌లో క్షిపణి దాడిలో ఏడుగురు గాయపడినట్లు అధికారులు చెప్పారు. జపొరిజియాపై గంట వ్యవధిలోనే 17సార్లు క్షిపణి దాడులు జరిగాయి. ఐదు క్షిపణులను, 5 షాహెద్ కిల్లర్ డ్రోన్లను కూల్చివేశామన్నారు. రష్యా క్షిపణులు రెండు రొమేనియా, మాల్దోవా గగనతలంలోకి వెళ్లినట్లు ఉక్రెయిన్ సైనిక జనరల్ ఒకరు చెప్పారు. నిరసనగా మాల్దోవా తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు పంపింది. డొనెట్స్క్లో రష్యా అదనంగా బలగాలను రంగంలోకి దించింది. లుహాన్స్క్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు రష్యా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు మూతే!
ఆరు ప్లాంట్లలో ఐదేళ్లపాటు ఉత్పత్తి లేనట్టే 2019 వరకు వాటికి గ్యాస్ రాదని కేంద్రం స్పష్టీకరణ 1,985 మెగావాట్ల విద్యుత్ కోల్పోతున్న రెండు రాష్ట్రాలు ఫలితంగా ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ.3,504 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ-6 క్షేత్రంపై ఆధారపడిన 1,985 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు గ్యాస్ విద్యుత్ కేంద్రాల్లో మరో ఐదేళ్లపాటు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. 2019 వరకూ వాటికి గ్యాస్ వచ్చే పరిస్థితి లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంధనశాఖలకు కేంద్రం సమాచారం పంపింది. అదేవిధంగా 2019 వరకూ కొత్తగా విద్యుత్ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫలితంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 5 వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌ప్లాంట్లు (అనిల్ అంబానీ రిలయన్స్, ల్యాంకో, జీఎంఆర్, జీవీకే) నిరుపయోగంగా ఉండిపోనున్నాయి. గ్యాస్ రాకపోవడం వల్ల విద్యుత్‌ను మార్కెట్లో కొనుగోలు చేయాల్సి రానుండటంతో ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం పడనుంది. ఈ ప్లాంట్లు మూతపడటం వల్ల రోజుకు 4.8 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఈ ప్లాంట్ల నుంచి రూ.4కే యూనిట్ విద్యుత్ వచ్చేది. మార్కెట్లో అయితే రూ.6 చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు భారం పడుతుంది. ఈ విధంగా ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం ఇరు రాష్ట్రాల ప్రజలపై పడుతుందన్నమాట. గ్యాస్ ధరపై కిరికిరి! : పారిశ్రామికవర్గాల్లో ఉన్న ప్రచారం మేరకు దేశీయ ఉత్పత్తి గ్యాస్‌కు అంతర్జాతీయ గ్యాస్ ధరలనే ఇచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండనుందని తెలుస్తోంది. కేజీ బేసిన్ గ్యాస్ ధరను కేంద్రం 2009లో నిర్ణయించింది. దీని ప్రకారం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయు)కు డిస్కంలు 4.2 డాలర్లు చెల్లిస్తున్నాయి. ఈ ధరలను ఐదేళ్లకోసారి సవరిస్తామని కేంద్రం పేర్కొంది. దీనిపై గత యూపీఏ సర్కారు కసరత్తు పూర్తిచేసి ఒక ఎంబీటీయూ ధరను 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే, దీని అమలుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు 2019 నుంచి అంతర్జాతీయ స్థాయి గ్యాస్ ధరలను అమలు చేస్తామని కూడా కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. అంటే 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ ధరను మనం చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం విదేశాల నుంచి తొలుత ట్యాంకుల్లో ద్రవరూప గ్యాస్‌ను దిగుమతి చేసుకుని, అనంతరం దానిని ఎల్ఎన్జీ టెర్మినల్ వద్ద గ్యాస్‌గా మారుస్తున్నారు. దీనిని ఆర్-ఎల్‌ఎన్‌జీగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాస్ ధర ఒక ఎంబీటీయుకు ఏకంగా 20 డాలర్ల వరకు ఉంది. ఈ ధర 2019 నాటికి ఎంతకు చేరుకుంటే.. ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుదుత్పత్తి ధర భారీగా పెరగనుంది. ఈ మొత్తం అంతిమంగా వినియోగదారులపైనే విద్యుత్ చార్జీల రూపంలో పడనుంది. ఆ ప్లాంట్లకు 15 తర్వాతే ‘గెయిల్’ గ్యాస్ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఆగస్టు 15వరకు ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. ఆగస్టు 15 తర్వాతే వాటికి గ్యాస్ సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖకు గెయిల్ తేల్చిచెప్పింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం లేఖ రాసింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు విడతలవారీగా గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని అందులో పేర్కొంది. ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల గ్యాస్‌పై ఆధారపడి 1,269 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ ప్లాంట్లు నడుస్తున్నాయి. నగరం వద్ద గెయిల్ పైపులైను పేలుడు నేపథ్యంలో మరమ్మతులు చేయడం కోసం గెయిల్ సంస్థ గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈ ప్లాంట్లలో అప్పటి నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. -
పల్లెల్లో కట్‌కట!
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం సాక్షి, హైదరాబాద్: కరెంటు కోతలతో పల్లె జనం అల్లాడుతోంది. గ్రామాల్లో పట్టుమని రోజుకు పది గంటలు కూడా కరెంట్ ఉండటం లేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. దీంతో సూర్య తాపం నుంచి ఉపశమనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. పగలు సంగతి పక్కనపెడితే.. రాత్రి వేళ కూడా గంట సేపు విద్యుత్ ఉంటే.. రెండు గంటలు కోత పడుతోంది. ఫలితంగా ఉక్కపోత, దోమల బెడదతో జనానికి కంటిమీద కునుకుండటం లేదు. మరోవైపు వ్యవసాయానికి 2-3 గంటలు మాత్రమే కరెంట్ అందుతోంది. దీంతో చేతికొచ్చిన పంట రైతుల కళ్లెదుటే నాశనమవుతోంది. రైతుల పరిస్థితి దారుణం రబీ సీజను చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అరకొర విద్యుత్ సరఫరాతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయానికి 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా..మొన్నటివరకు అధికారికంగానే 2 గంటల వరకు కోతలు విధించారు. అంటే నికరంగా ఐదు గంటలు మాత్రమే కరెంటిచ్చినట్లు లెక్క. అయితే, ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరెంట్ సరిగా రావడం లేదని, మొత్తంగా 2-3 గంటలు దాటడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కొద్దిపాటి సమయం కూడా ఒకే విడతలో ఇవ్వడం లేదని, గంటల తరబడి అంతరాయంతో విద్యుత్ సరఫరా చేస్తూ అధికారులు తమని వేధిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ సమస్యతో తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోందని, మిగతా పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనమవుతోందని కన్నీళ్లు పెడుతున్నారు. మంచినీటికి కటకట: విద్యుత్ కోతల దెబ్బతో గ్రామాల గొంతెండిపోతోంది. అనేక ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. కరెంటు ఉన్నప్పుడే ఓవర్‌హెడ్ ట్యాంకులను మంచినీటితో నింపుతారు. అయితే విద్యుత్ సరఫరాపై ఎలాంటి సమాచారం లేకపోవడం, తరచూ కోతలతో నీళ్ల ట్యాంకులను నింపడం సాధ్యం కావడం లేదు. దీంతో గ్రామీణులకు నీటి సరఫరా సజావుగా ఉండటం లేదు. మరోవైపు ఎన్నికల కోడ్ పేరుతో ట్యాంకర్ల ద్వారా కూడా మంచి నీటిని అధికారులు సరఫరా చేయడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం కూడా జనం అల్లాడిపోతున్నారు. విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు గతంతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కాస్త తగ్గినా ప్రయోజనం కనిపించడం లేదు. ఒక దశలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 300 మిలియన్ యూనిట్లు(ఎంయూ)లు దాటింది. తాజాగా శనివారం(3న) 279 ఎంయూల వరకు డిమాండ్ నమోదైంది. సరఫరా మాత్రం 254 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. అంటే 25 ఎంయూల మేర లోటు ఉంది. దీన్ని పూడ్చుకునేందుకు ఎడా పెడా కోతలు విధించాల్సి వస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత వల్ల విద్యుత్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బాయిలర్ ట్యూబ్‌లకు లీకులు పడి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తోంది. ఇటువంటి సమయాల్లో విద్యుత్ లోటు మరింత పెరుగుతోంది. ఫలితంగా హైదరాబాద్‌లోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచే కోతలను అమలు చేస్తున్నారు. దీంతో ఊర్లకు ఊర్లు కరెంటు కోతల బారిన పడుతున్నాయి. అదేవిధంగా జెన్కో విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత సమస్య ఉంది. దీనివల్ల తక్కువ సామర్థ్యంతోనే ప్లాంట్లను నడపాల్సి వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ర్ట ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఉక్కపోతతో అల్లాడుతున్నాం పగటిపూట అసలే కరెంటు ఉండటం లేదు. ఉక్కపోతతో అల్లాడుతున్నాం. రాత్రి పూట కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దోమల భయానికి నిద్రనే రావడం లేదు. రోజూ శివరాత్రిలా ఉంటోంది. దోమల వల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయి. పిల్లలకు జ్వరం వస్తోంది. పత్తి పంట చివరి దశకు వచ్చింది. వ్యవసాయానికీ కరెంటు లేక చేతికొస్తున్న పంట చెడిపోతోంది. - విక్రం సింహారెడ్డి, చిన్నధన్వాడ, మహబూబ్‌నగర్ కత్తెర పంటలు కష్టమే కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోయాయి. ఎలాగైనా పంటను దక్కించుకోవాలని అనేక మంది రైతులు జనరేటర్లు పెట్టుకున్నారు. దీంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. గతంలో భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రబీ ముగిసిన తర్వాత కత్తెర పంటలు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరెంటే లేదు. ఇక కత్తెర పంటలు వేయడం కష్టమే. - సత్తయ్య, మోత్కుపల్లి, నల్లగొండ జిల్లా