గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు మూతే!
ఆరు ప్లాంట్లలో ఐదేళ్లపాటు ఉత్పత్తి లేనట్టే
2019 వరకు వాటికి గ్యాస్ రాదని కేంద్రం స్పష్టీకరణ
1,985 మెగావాట్ల విద్యుత్ కోల్పోతున్న రెండు రాష్ట్రాలు
ఫలితంగా ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ.3,504 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ-6 క్షేత్రంపై ఆధారపడిన 1,985 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు గ్యాస్ విద్యుత్ కేంద్రాల్లో మరో ఐదేళ్లపాటు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. 2019 వరకూ వాటికి గ్యాస్ వచ్చే పరిస్థితి లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంధనశాఖలకు కేంద్రం సమాచారం పంపింది. అదేవిధంగా 2019 వరకూ కొత్తగా విద్యుత్‌ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఫలితంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 5 వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌ప్లాంట్లు (అనిల్ అంబానీ రిలయన్స్, ల్యాంకో, జీఎంఆర్, జీవీకే) నిరుపయోగంగా ఉండిపోనున్నాయి. గ్యాస్ రాకపోవడం వల్ల విద్యుత్‌ను మార్కెట్లో కొనుగోలు చేయాల్సి రానుండటంతో ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం పడనుంది. ఈ ప్లాంట్లు మూతపడటం వల్ల రోజుకు 4.8 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఈ ప్లాంట్ల నుంచి రూ.4కే యూనిట్ విద్యుత్ వచ్చేది. మార్కెట్‌లో అయితే రూ.6 చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు భారం పడుతుంది. ఈ విధంగా ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం ఇరు రాష్ట్రాల ప్రజలపై పడుతుందన్నమాట.
గ్యాస్ ధరపై కిరికిరి! : పారిశ్రామికవర్గాల్లో ఉన్న ప్రచారం మేరకు దేశీయ ఉత్పత్తి గ్యాస్‌కు అంతర్జాతీయ గ్యాస్ ధరలనే ఇచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండనుందని తెలుస్తోంది. కేజీ బేసిన్ గ్యాస్ ధరను కేంద్రం 2009లో నిర్ణయించింది. దీని ప్రకారం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయు)కు డిస్కంలు 4.2 డాలర్లు చెల్లిస్తున్నాయి. ఈ ధరలను ఐదేళ్లకోసారి సవరిస్తామని కేంద్రం పేర్కొంది. దీనిపై గత యూపీఏ సర్కారు కసరత్తు పూర్తిచేసి ఒక ఎంబీటీయూ ధరను 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
అయితే, దీని అమలుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు 2019 నుంచి అంతర్జాతీయ స్థాయి గ్యాస్ ధరలను అమలు చేస్తామని కూడా కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. అంటే 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ ధరను మనం చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం విదేశాల నుంచి తొలుత ట్యాంకుల్లో ద్రవరూప గ్యాస్‌ను దిగుమతి చేసుకుని, అనంతరం దానిని ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ వద్ద గ్యాస్‌గా మారుస్తున్నారు. దీనిని ఆర్-ఎల్‌ఎన్‌జీగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాస్ ధర ఒక ఎంబీటీయుకు ఏకంగా 20 డాలర్ల వరకు ఉంది. ఈ ధర 2019 నాటికి ఎంతకు చేరుకుంటే.. ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుదుత్పత్తి ధర భారీగా పెరగనుంది. ఈ మొత్తం అంతిమంగా వినియోగదారులపైనే విద్యుత్ చార్జీల రూపంలో పడనుంది.
ఆ ప్లాంట్లకు 15 తర్వాతే ‘గెయిల్’ గ్యాస్
గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఆగస్టు 15వరకు ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. ఆగస్టు 15 తర్వాతే వాటికి గ్యాస్ సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖకు గెయిల్ తేల్చిచెప్పింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం లేఖ రాసింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు విడతలవారీగా గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని అందులో పేర్కొంది. ఓఎన్‌జీసీ, రవ్వ క్షేత్రాల గ్యాస్‌పై ఆధారపడి 1,269 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ ప్లాంట్లు నడుస్తున్నాయి. నగరం వద్ద గెయిల్ పైపులైను పేలుడు నేపథ్యంలో మరమ్మతులు చేయడం కోసం గెయిల్ సంస్థ గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈ ప్లాంట్లలో అప్పటి నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.