పల్లెల్లో కట్‌కట!
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కరెంటు కోతలతో పల్లె జనం అల్లాడుతోంది. గ్రామాల్లో పట్టుమని రోజుకు పది గంటలు కూడా కరెంట్ ఉండటం లేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. దీంతో సూర్య తాపం నుంచి ఉపశమనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. పగలు సంగతి పక్కనపెడితే.. రాత్రి వేళ కూడా గంట సేపు విద్యుత్ ఉంటే.. రెండు గంటలు కోత పడుతోంది. ఫలితంగా ఉక్కపోత, దోమల బెడదతో జనానికి కంటిమీద కునుకుండటం లేదు. మరోవైపు వ్యవసాయానికి 2-3 గంటలు మాత్రమే కరెంట్ అందుతోంది. దీంతో చేతికొచ్చిన పంట రైతుల కళ్లెదుటే నాశనమవుతోంది.
రైతుల పరిస్థితి దారుణం
రబీ సీజను చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అరకొర విద్యుత్ సరఫరాతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయానికి 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా..మొన్నటివరకు అధికారికంగానే 2 గంటల వరకు కోతలు విధించారు. అంటే నికరంగా ఐదు గంటలు మాత్రమే కరెంటిచ్చినట్లు లెక్క. అయితే, ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరెంట్ సరిగా రావడం లేదని, మొత్తంగా 2-3 గంటలు దాటడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కొద్దిపాటి సమయం కూడా ఒకే విడతలో ఇవ్వడం లేదని, గంటల తరబడి అంతరాయంతో విద్యుత్ సరఫరా చేస్తూ అధికారులు తమని వేధిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ సమస్యతో తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోందని, మిగతా పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనమవుతోందని కన్నీళ్లు పెడుతున్నారు.
మంచినీటికి కటకట: విద్యుత్ కోతల దెబ్బతో గ్రామాల గొంతెండిపోతోంది. అనేక ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. కరెంటు ఉన్నప్పుడే ఓవర్‌హెడ్ ట్యాంకులను మంచినీటితో నింపుతారు. అయితే విద్యుత్ సరఫరాపై ఎలాంటి సమాచారం లేకపోవడం, తరచూ కోతలతో నీళ్ల ట్యాంకులను నింపడం సాధ్యం కావడం లేదు. దీంతో గ్రామీణులకు నీటి సరఫరా సజావుగా ఉండటం లేదు. మరోవైపు ఎన్నికల కోడ్ పేరుతో ట్యాంకర్ల ద్వారా కూడా మంచి నీటిని అధికారులు సరఫరా చేయడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం కూడా జనం అల్లాడిపోతున్నారు.
విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు
గతంతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కాస్త తగ్గినా ప్రయోజనం కనిపించడం లేదు. ఒక దశలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 300 మిలియన్ యూనిట్లు(ఎంయూ)లు దాటింది. తాజాగా శనివారం(3న) 279 ఎంయూల వరకు డిమాండ్ నమోదైంది. సరఫరా మాత్రం 254 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. అంటే 25 ఎంయూల మేర లోటు ఉంది. దీన్ని పూడ్చుకునేందుకు ఎడా పెడా కోతలు విధించాల్సి వస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత వల్ల విద్యుత్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బాయిలర్ ట్యూబ్‌లకు లీకులు పడి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తోంది. ఇటువంటి సమయాల్లో విద్యుత్ లోటు మరింత పెరుగుతోంది. ఫలితంగా హైదరాబాద్‌లోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) నుంచే కోతలను అమలు చేస్తున్నారు. దీంతో ఊర్లకు ఊర్లు కరెంటు కోతల బారిన పడుతున్నాయి. అదేవిధంగా జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత సమస్య ఉంది. దీనివల్ల తక్కువ సామర్థ్యంతోనే ప్లాంట్లను నడపాల్సి వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ర్ట ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
ఉక్కపోతతో అల్లాడుతున్నాం
పగటిపూట అసలే కరెంటు ఉండటం లేదు. ఉక్కపోతతో అల్లాడుతున్నాం. రాత్రి పూట కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దోమల భయానికి నిద్రనే రావడం లేదు. రోజూ శివరాత్రిలా ఉంటోంది. దోమల వల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయి. పిల్లలకు జ్వరం వస్తోంది. పత్తి పంట చివరి దశకు వచ్చింది. వ్యవసాయానికీ కరెంటు లేక చేతికొస్తున్న పంట చెడిపోతోంది.
- విక్రం సింహారెడ్డి, చిన్నధన్వాడ, మహబూబ్‌నగర్
కత్తెర పంటలు కష్టమే
కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోయాయి. ఎలాగైనా పంటను దక్కించుకోవాలని అనేక మంది రైతులు జనరేటర్లు పెట్టుకున్నారు. దీంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. గతంలో భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రబీ ముగిసిన తర్వాత కత్తెర పంటలు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరెంటే లేదు. ఇక కత్తెర పంటలు వేయడం కష్టమే.
- సత్తయ్య, మోత్కుపల్లి, నల్లగొండ జిల్లా