కోతలపై భగ్గు | common man fires on power cuts | Sakshi
Sakshi News home page

కోతలపై భగ్గు

Published Mon, Jan 20 2014 11:51 PM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

కోతలపై భగ్గు - Sakshi

కోతలపై భగ్గు

 కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. సోమవారం జిల్లాలో పలు చోట్ల అన్నదాతలు రాస్తారోకో, ధర్నాకు దిగారు. గజ్వేల్ మండలం అక్కారంలో విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. లోఓల్టేజీకి తోడు, ఎర్తింగ్ లోపంతో ఊరంతా షాక్ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇద్దరు మృత్యువాత పడినా అధికారుల్లో మార్పురావడంలేదని అధికారులను నిలదీశారు. వ్యవసాయ రంగానికి ఏడు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పాపన్నపేట మండలం మిన్‌పూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో పారిన మడులనే మళ్లీ పారబెట్టాల్సి వస్తోందని వాపోయారు. ఆందోళన సుమారు 3 గంటలపాటు సాగడంతో మెదక్-బొడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో చేగుంట సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. కోతలను ఎత్తివేసి, నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు విద్యుత్ శాఖ డీఈ హామీతో ఆందోళన విరమించారు.
 
 కరెంట్ కోతలపై రైతులు భగ్గుమన్నారు. ఏడు గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు సోమవారం పలు చోట్ల ఆందోళనలకు దిగారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో  విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. పాపన్నపేట మండలం మిన్‌పూర్ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. చేగుంట సబ్‌స్టేషన్ ఎదుట టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక అధికారులు హామీలు ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.     - న్యూస్‌లైన్ నెట్‌వర్క్
 
 అక్కారంలో విద్యుత్ సిబ్బంది నిర్బంధం
 గజ్వేల్: ప్రాణాలు పోతున్నా... గ్రామంలో సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన లోపాలు సరిచేయడం లేదని, వ్యవసాయానికి కరెంట్‌ను సక్రమంగా ఇవ్వడం లేదంటూ గజ్వేల్ మండలం అక్కారం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలో గత డిసెంబర్ 26న రాత్రి 11.30గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ‘ఊరంతా షాక్’ ఘటనతో బుడిగె చంద్రయ్య, బుడిగె రాజులు దుర్మరణం పాలైనా అధికారులు సరిగా స్పందించలేదంటూ మండిపడ్డారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలోని సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్‌లోపం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని గుర్తించిన అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటకు మార్చడంతోపాటు కరెంట్ కనెక్షన్‌లేని వారికి కొత్తగా కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కానీ ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని, తమ గ్రామంపై విద్యుత్‌అధికారులు చిన్నచూపు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం కరెంట్ బిల్లుల వసూలు నిమిత్తం గ్రామానికి వచ్చిన లైన్‌మెన్‌లు భూపతి, కొమురయ్య, అదే శాఖలో పనిచేస్తున్న దర్శన్ అనే ముగు్గు రిని స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. సుమారు గంటన్నరకుపైగా వారు నిర్భంధంలోనే ఉన్నారు.  సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఎస్‌ఐ ఆంజనేయులు, విద్యుత్ శాఖ ఏఈ అనిల్‌కుమార్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘మా ప్రాణాలు పోయినా పట్టించుకోరా..?, వ్యవసాయానికి ఇష్టమొచ్చినట్లు కోత పెట్టడంతో పంటలన్నీ ఎండిపోతున్నయి’  అంటూ అధికారులను నిలదీశారు.  సమస్యలను తొందర్లోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి విద్యుత్ సిబ్బందిని విడిచిపెట్టారు.
 
 మిన్‌పూర్‌లో రాస్తారోకో
 పాపన్నపేట: కరెంట్ కోతలు ఎత్తివేస్తూ ఏడుగంటలపాటు నిరంతరం విద్యుత్‌సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మిన్‌పూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. 12 గ్రామాల రైతులు తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు 3గంటలపాటు ఆందోళన కొనసాగడంతో మెదక్-బొడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాపన్నపేట మండలంలో ఆరు సబ్‌స్టేషన్లు ఉన్నా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఏడు గంటల విద్యుత్‌ను రెండు విడుతలుగా ఇస్తుండడంతో పారిన మడులనే మళ్లీ పారబెట్టాల్సి వస్తుందని, మిగతా మడులు తడవడం లేదంటున్నారు. మధ్యలో లోడ్ రిలీఫ్, బ్రేక్‌డౌన్‌ల పేరిట సుమారు గంట నుంచి గంటన్నరపాటు కోత విధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కోల్పోయిన సమయాన్ని తిరిగి భర్తీ చేయడం లేదని, దీంతో రోజుకు కేవలం ఐదున్నర నుంచి ఆరుగంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. 7గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీ సుధీర్‌తోపాటు పాపన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. వరినాట్లు జోరుగా కొనసాగుతున్న తరుణంలో కరెంట్ కోతలు విధిస్తే పంటల పరిస్థితి ఏమిటని వారు అధికారులను నిలదీశారు. 7గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే అధికారం తనకు లేదని, లోడ్ రిలీఫ్‌ల పేరిట కోల్పోయిన విద్యుత్‌ను తిరిగి సరఫరా చేయిస్తామని ఏడీ హామి ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ ఆందోళనలో లక్ష్మీనగర్ సర్పంచ్ బాపారావు, అబ్లాపూర్ సర్పంచ్ సత్యనారాయణ, అన్నారం సర్పంచ్ మోహన్, కుర్తివాడ సర్పంచ్ రామాగౌడ్, బాచారం సర్పంచ్ వెంకట్రాములుతోపాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
 
 రోడ్డుపై బైఠాయింపు
 చేగుంట: వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చేగుంట సబ్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. స్థానిక ప్రొబేషనరీ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ శాఖ డీఈతో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యను వివరించారు. 7గంటల నిరంతర విద్యుత్‌తోపాటు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో బాగు చేయించి ఇస్తామని డీఈ యాదయ్య హామీ ఇచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు భూమలింగంగౌడ్, సొసైటీ చైర్మన్‌లు వెంగళ్‌రావు, నర్సింహచారి, నారాయణరెడ్డి, మాజీ సర్పంచు నర్సింలు విశ్వేశ్వర్‌రావు, శ్రీను, సత్యనారాయణ, లక్ష్మణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement