ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని తెలంగాణ బీజేపీ మాంచి జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా ఎంపీలయ్యారు. ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. ఇంత జోష్‌లో ఉన్న బీజేపీ నేతలు, క్యాడర్‌కు ఓ ఇబ్బంది ఎదురవుతోంది. కొత్త ఎంపీలు, కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్ర నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? శ్రేణులకు నాయకులు ఇచ్చిన భరోసా ఏంటి?
తెలంగాణలో బీజేపీ ఫేస్‌గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. మోదీ రెండో కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డికి ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్‌కు కూడా కేంద్ర కేబినెట్‌లో పదవి దక్కింది.
ఇప్పుడు బీజేపీకి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళతో పాటుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్యను భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవర్ సెంటర్స్ పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.
కేంద్రంలోను, రాష్ట్రంలోను కమలం పార్టీ నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమెటిక్‌గా పార్టీలో పవర్ సెంటర్స్ కూడా పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథిగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ అనే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు.
కిషన్ రెడ్డి మనిషిగా బండి సంజయ్ మనిషిగా ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే భవిష్యత్‌లో పొలిటికల్ కేరీర్‌కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా నేత మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కవేమోననే భయం క్యాడర్‌ను పట్టి పీడిస్తోంది.
కాషాయ సేనకు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంతా పైకి బాగానే ఉంటారు. తామంతా ఒక్కటే అన్నట్లుగానే కనిపిస్తారు. కాని ఒకరి కంటే ఒకరు ముందుండాలని, పార్టీలో పట్టు సాధించాలని తపన పడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కీలక నాయకుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ముఖ్య నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్‌ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment