గ్రామాల్లో విద్యుత్ వివాదం
తాగునీటి వనరులు, వీధి దీపాలకు కట్
బకాయిలు చెల్లిస్తేనే పునరుద్ధరిస్తామంటున్న కరెంట్ అధికారులు
నిస్సహాయ స్థితిలో సర్పంచ్లు...ఉన్నతాధికారులపై ఆగ్రహం
గీసుకొండ : గ్రామపంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపులో వివాదం నెలకొంది. తాము పదవిలోకి వచ్చి ఏడాది అవుతోంది... రూ.లక్షల్లో బిల్లులు ఎట్లా చెల్లించాలి... గతంలో పనిచేసిన సర్పంచ్ల వద్ద ఎందుకు బిల్లులు వసూలు చేయలేదు... తమనే ఎందుకు అడుగుతున్నారని ఆయూ గ్రామాల సర్పంచ్లు ఓ వైపు ప్రశ్నిస్తున్నారు. బిల్లు బకాయిలను చెల్లించే వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు మరోవైపు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు... గ్రామపంచాయతీ ల ద్వారా ప్రజలకు తాగునీరందించే పబ్లిక్ వాటర్ స్కీం కిం ద ఓపెన్వెల్, బోరు బావులతోపాటు వీధి దీపాలకు విద్యుత్ కనెకసన్లను కట్ చేశారు.
ఇప్పటికే గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హ వేలి, సింగ్యాతండా, అనంతారం గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేయగా... శుక్రవారం గీసుకొండ, గంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలితోపాటు పలు గ్రా మాలకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు. సంగెం మండలంలోనూ చాలా గ్రామపంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా ఆయూ గ్రామాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు మొదలయ్యూరుు. రాత్రివేళల్లో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం సంగెం మండల సర్వసభ్య సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. బిల్లులను గతం నుంచి ప్రభుత్వమే చెల్లిస్తోందని, తమను చెల్లించమంటే ఎక్కడి నుంచి తేవాలని పలు గ్రామాల సర్పంచ్లు వాపోయారు.
అంతా అయోమయం...
విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్లు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని, ఇప్పుడు కొత్తగా కట్టాలని అడిగితే ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు మంజూరయ్యే టీఎఫ్సీ నిధులను తాగునీటి కోసం ఖర్చు చేయాలని.. నిధులు మిగిలితే పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.
అంతేతప్ప కరెంటు బిల్లులకు చెల్లించాలని ఎక్కడా లేదని అంటున్నారు. తమ గ్రామానికి ఐదేళ్లపాటు మంజూరైన టీఎఫ్సీ నిధులను మొత్తం కేటాయించినా... విద్యుత్ బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు... తాగునీటి బావులు, బోర్లు, వీధి దీపాలకు మీటర్లను ఏర్పాటు చేయలేదని, ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లుల భారం మోపారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్ప్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీలకు ఏమి ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
తేల్చాల్సింది ఉన్నతాధికారులే...
తాగు నీటి వనరులకు కరెంట్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో మచ్చాపూర్ ఇన్చార్జ్ ఏఈని ‘సాక్షి’ సంప్రదించింది. ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించగా... కరెంటు బిల్లులకు సంబంధించిన నిధులను పంచాయతీలకు విడుదల చేశామని డీపీఓ తమకు చెప్పారని పేర్కొన్నారు. సర్పంచ్లు చెల్లించకపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. అసలు ఈ నిధులు విడుదల కాలేదని సర్పంచ్లు చెబుతుండడం విశేషం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వీరు ఎట్ల కడతారో..!
అనంతారంలో పంచాయతీ రూ. 4,11,445 విద్యుత్ బిల్లుల బకాయిలు చె ల్లించాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ గ్రామ పంచాయ తీ ఏడాది ఆదాయం రూ. 42 వేలే. బీఆర్జీఎఫ్ నిధులు రూ. 30 వేలు, ఎస్ఎఫ్సీ నిధులు 7 వేలు, టీఎఫ్సీ నిధులు 18 వేలు. ఈ లెక్కన ఐదేళ్లపాటు ఇంటిపన్నులు, ఇతర అభివృద్ధి నిధులను విద్యుత్ బిల్లుకు చెల్లించినా సరిపోవు.
గంగదేవిపల్లి పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లు బకాయిలు రూ. 6 లక్షలు. ఈ పంంచాయతీకి ఏడాదికి ఇంటిపన్నుల రూపంలో రూ. 1.56 లక్షలు, కొత్తగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూ. 20 వేలు, రహదారి పన్ను కింద రూ. 4 వేల ఆదాయం సమకూరుతోంది. పంచాయతీ ఆదాయం నుంచి 30 శాతం వేతనాలు, 16 శాతం వీధిలై ట్ల నిర్వహణ, 20 శాతం తాగునీటి కోసం, మరో 20 శాతం రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆదాయం మొత్తం ఈ ఖర్చులకే పోతే రూ. 6 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు ఎలా చెల్లించాలని సర్పంచ్లు ప్రశ్నిస్తున్నారు.
గీసుకొండ గ్రామంలో రూ. 16 లక్షల బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఇంటిపన్నులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర ఆదయాలు మొత్తం కలిపినా బిల్లుకు సరిపోని పరిస్థితి.
కరెంట్ కట్ చేయొద్దని ఆదేశించా
- కలెక్టర్ కిషన్
గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు పేరుతో పంచాయతీలకు సంబంధించి తాగునీటి బావులు, బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయొద్దని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)కి చెప్పానని కలెక్టర్ కిషన్ తెలిపారు. శనివారం గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగాగంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలి, శాయంపేట, అనంతారం గ్రామ సర్పంచ్లు ఇట్ల శాంతి, భీమగాని సౌజన్య, కొంగర చంద్రమౌళి, దనేకుల వెంకటేశ్వర్లు విద్యుత్ బిల్లు బకాయిల సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్పంచ్లు తాము పదవి చేపట్టిన కాలం నుంచైనా కరెంటు బిల్లులను చెల్లించాలని, నల్లా కనెక్షన్లు తీసుకున్న వారి నుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేసి... కరెంటు బిల్లులు చెల్లించాలన్నారు. మీటర్లు ఉన్న వాటికే బిల్లులు చెల్లించాలని, లేనివాటికి చెల్లించొద్దని స్పష్టం చేశారు.