కథ మీద దృష్టి పెట్టడం లేదు : దాసరి నారాయణరావు
‘‘ఈరోజుల్లో సినిమాలు తీసేందుకు, దాని పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. విదేశాల్లో పాటలు, సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం పెడుతున్న శ్రద్ధ కథకు ప్రాధాన్యత ఇవ్వడంలో పెట్టడం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడితే పెద్దది, ఆడకపోతే చిన్న సినిమా. రెండు లక్షలు పెట్టి తీసిన ‘స్వర్గం- నరకం’, ‘తాత-మనవడు’ చిన్న చిత్రాలైనా ఏడాది పాటు ఆడాయి. శ్రీకాంత్ నటించిన ‘టై’ సినిమా బాగున్నా సరిగ్గా ఆడలేదు. సినిమా బాగుందని జనాల్లోకి వెళ్లే లోపు థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. అదే కథను బాలీవుడ్లో తీస్తే వంద కోట్లు కలెక్ట్ చేసేది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు.
శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వివిఎఎన్ ప్రసాద్ దాసరి, వివి దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ చిత్రం ట్రైలర్ను దాసరి విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘ఎవరికీ లొంగని పవర్ఫుల్ పోలీసాఫీసర్ కథే ఈ చిత్రం. క్యారెక్టర్ పరంగా ఆ టైటిల్ పెట్టాం. దీనిపై పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలొస్తున్నాయి. వారిని కలిసి ఈ టైటిల్ ఎందుకు పెట్టామో వివరిస్తాం. అయినా వినకపోతే టైటిల్ మారుస్తాం’’ అన్నారు.