రంగంలోకి కలెక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారులో కొంత జాప్యం చోటుచేసుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ మొదలు ఇతర ముఖ్య అధికారులు పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకున్నారు. అయినా ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆదివారమే రిజర్వేషన్ల లెక్కలు తేలే అవకాశాలున్నాయి. జిల్లాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి శనివారంలోగా పంపించాలని ఇదివరకే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంపై శనివారం స్వయంగా కలెక్టర్లే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి కుదించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిల్లో సర్పంచ్, వార్డు స్థానాల కేటాయింపుల్లో కొన్నిచోట్ల తప్పులు దొర్లడంతో హుటాహుటిన వాటిని సరిచేసే చర్యలను అధికారులు చేపట్టారు.
కొన్ని మండలాల్లో సర్పంచ్ స్థానాలు, మరికొన్ని చోట్ల వార్డు సభ్యుల రిజర్వేషన్లలో లెక్కలు తేలకపోవడంతో మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టరేట్లకే రప్పించి ఎక్కడ లోపాలున్నాయో చూసి, సరిదిద్దే చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల మహిళల రిజర్వేషన్లు 50 శాతానికి పైగా మించి 60 నుంచి 70 శాతానికి చేరుకోవడం, అనుకున్న స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తేలకపోవడం, వార్డు సభ్యుల వారీగా రిజర్వేషన్ల ఖరారులో ఇబ్బందులు వంటివి తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో మండల కోటాలు ఖరారయ్యాక ఆర్డీవోల ఆధ్వర్యంలో వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కసరత్తు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రికల్లా మెజారిటీ జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని పీఆర్ అధికారులు వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కొన్ని జిల్లాల రిజర్వేషన్లు ఆదివారం నాటికి తేలవచ్చునని తెలుస్తోంది.
గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కొన్ని జిల్లాల కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కసరత్తు పూర్తయిన ఏ జిల్లాకు ఆ జిల్లాలో గెజిట్లను ప్రచురించే అవకాశాలున్నాయి. అదేరోజు వీటన్నింటిని క్రోడీకరించి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ అందజేయను న్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా ల్లోని సర్పంచ్, వార్డులకు ఖరారు చేసిన రిజర్వేషన్లను సూక్ష్మంగా పరిశీలించి, ఆయా అంశాలపై న్యాయసలహా తీసుకున్నాక ఒకట్రెండు రోజుల్లో ఎస్ఈసీ పంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.
కలెక్టర్లకు పీఆర్ కమిషనర్ ఆదేశాలు..
సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కసరత్తు పూర్తికాని జిల్లాలు ఆదివారం సాయంత్రంలోగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే కమిషనర్ కార్యాలయానికి కలెక్టర్లు తెలియజేయాలని సూచించారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తికాని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆమె ఈ మేరకు వర్తమానం పంపించారు. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి సంబంధించి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ పంపించాల్సి ఉన్నందున అప్పటిలోగా ఈ అంశాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.