పార్వతీపురంలో జనవరి నుంచి త్రీజీ సేవలు
బెలగాం, న్యూస్‌లైన్: పార్వతీపురం పట్టణానికి 2014 జనవరిలో త్రీజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభా రామారావు చెప్పారు. పార్వతీపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో వినియోగదారులతో బుధవారం ఓపెన్‌హౌస్ సెషన్స్‌ను నిర్వహించారు. ఈ సదస్సులో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ పథకాలు, సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సులో పాల్గొన్న వినియోగదారులు పలు సమస్యలను, అభిప్రాయలు, సలహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పార్వతీపురం పట్టణంలో ల్యాండ్ లైన్ సక్రమంగా పనిచేయడం లేదని, ఇది వరలో ఇక్కడ ఉన్న సబ్‌డివిజనల్ ఇంజినీర్ కార్యాలయాన్ని బొబ్బిలికి తరలించారని, తిరిగి ఆ కార్యాలయాలన్ని పునరుద్ధరించాలని వినియోగదారులు కోరారు. హైదరాబాద్‌లో బ్రాండ్‌బాండ్ అన్‌లిమిటెడ్‌కు రూ.500 చెల్లిస్తున్నారని ఆ విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలన్నారు. సెల్‌టవర్స్, ల్యాండ్ లైన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వినియోగదారులు వాపోగా సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని డీజీఎం చెప్పారు.
రూ.1కోటి బకాయి
సదస్సు అనంతరం డీజీఎం విలేకరులతో మాట్లాడుతూ. జిల్లాలోని బీఎస్ఎన్ఎల్కు రూ.1కోటి బకాయిలు రావలసి ఉందన్నారు. ఈ సొమ్ము రికవరీకీ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 191 సెల్‌టవర్స్ ఉన్నాయని అదనంగా ఈ ఏడాది 74సెల్‌టవర్స్ మంజూరయ్యాయని చెప్పారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన చినగుడబ, కొత్తవలస, కన్యకాపరవేశ్వరి ఆలయం, ఉల్లిభద్ర, శిఖబడి, మునుగడ, తాడికొండలలో సెల్‌టవర్స్ నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్కు నెలకు రూ.4కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. సమావేశంలో డీఈ వై.సాంబశివరావు, ఏఈ పి.సురేష్‌కుమార్, జేటీఓ రామశేఖర్, ఎస్డీఈ తాతప్రసాద్, టెలి కం అడ్వైజర్ మెంబర్ ఎం.సింహచలం, సిబ్బంది, వినియోగదారులు ఉన్నారు.