Practical Knowledge
-
నైపుణ్యాలకు నవ్య పథం.. ఇంటర్న్‌షిప్!
సైద్ధాంతిక పరిజ్ఞానం విద్యార్థికి ఓ కొత్త అంశాన్ని పరిచయం చేస్తే, ప్రాక్టికల్ పరిజ్ఞానం ఆ అంశం లోతుపాతుల్ని ఒంటబట్టిస్తుంది! ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలకే పెద్దపీట. నియామకాల సందర్భంగా ఓ విద్యార్థి తరగతిగదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ఎంత వరకు క్షేత్రస్థాయిలో ఆచరించి చూపగలరనే దాన్ని పరిశ్రమలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు చదివేవారు కోరుకున్న కొలువు దక్కించుకునేందుకు ఇంటర్న్షిప్స్ కీలకమవుతున్నాయి. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘‘ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్’’ ప్రారంభించిన నేపథ్యంలో.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.. ఇంటర్న్షిప్స్.. క్యాంపస్‌లో ఉన్నప్పుడే పరిశ్రమల కార్యకలాపాలపై శిక్షణ, పని అనుభవాన్ని పొందడానికి తోడ్పాటును అందిస్తున్నాయి. విద్యార్థి దశలోనే ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయి. ‘‘ఇటీవలి కాలంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యా ప్రాంగణాల్లోనే పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను మలిచే పనిలో నిమగ్నమవుతున్నాయి. ఇందులో భాగంగా టాప్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లలోని ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వారికి తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశమిస్తున్నాయి. ఆపై గ్రాడ్యుయేషన్ పూర్తయిందే తడవు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి’’ అంటున్నారు ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ హెడ్ టీవీ దేవీప్రసాద్. ఇంజనీరింగ్ విద్యార్థులకు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014 ఇంటర్న్‌షిప్‌ను అకడమిక్ స్థాయిలో వివిధ కోర్సులకు అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో ‘ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకానికి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో ఎడ్యుకేషన్, సోషల్ సెన్సైస్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఐసీటీ, లా కోర్సుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ కోర్సులు చేస్తున్న వారు అర్హులు. ఐఐటీ, ఐఐఎం, పరిశోధన/అభివృద్ధి సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, భాషా విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు తదితరాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి రెండు నెలలు, అవసరాన్ని బట్టి ఆరు నెలల వరకు పొడిగిస్తారు. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. పథకం మొదటి బ్యాచ్ ఇంటర్న్‌షిప్ అక్టోబర్ 1న ప్రారంభమైంది. మిగిలిన బ్యాచ్‌లకు ఔత్సాహిక విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: mhrd.gov.in ప్రముఖ సంస్థల్లో అవకాశాలు బీహెచ్ఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్, ఇస్రో వంటి సంస్థలు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎల్ అండ్ టీ, టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. వివిధ విభాగాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందించడంలో డీఆర్డీవో, సీసీఎంబీ, ఐఐఆర్ఎస్, ఏఆర్సీఏ తదితర సంస్థలు ముందుంటున్నాయి. విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకొని ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందుకోవచ్చు. డీఆర్డీవో: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో).. ఏటా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. సంస్థకు చెందిన ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొనేలా చేసి ప్రాక్టికల్ పరిజ్ఞానం అందిస్తోంది. విద్యార్థుల అర్హతలు, అవసరాలకు అనుగుణంగా సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందొచ్చు. సాధారణ సమయంతోపాటు వేసవిలోనూ ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రవేశాలు కల్పిస్తోంది. వెబ్సైట్: www.drdo.gov.in సీసీఎంబీ:సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ).. విద్యార్థులకు ఏటా వేసవిలో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లో సైన్స్ బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పరిశోధన వాతావరణం వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ ఇంటర్న్‌షిప్ దోహదం చేస్తుంది. విద్యార్థులకు సీసీఎంబీ సైంటిస్టులు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. వెబ్సైట్: www.ccmb.res.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ విభాగమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్).. విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్‌లకు వీలు కల్పిస్తోంది. విద్యార్థులకు ఐఐఆర్ఎస్ ఫ్యాకల్టీ సభ్యులు గైడ్/సూపర్వైజర్గా వ్యవహరిస్తారు. ఎంఎస్సీ, ఎంఎస్సీ (టెక్), ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, ఎంసీఏ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టు చేపట్టే అవకాశాన్ని ఐఐఆర్ఎస్ కల్పిస్తోంది. వేసవి శిక్షణ అవకాశాన్ని సంస్థ ఉద్యోగ సంబంధీకులతో పాటు ఐఐటీ, బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ, నిట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. వెబ్సైట్: www.iirs.gov.in ఏఆర్‌సీఐ: ఇంటర్నేషనల్ అడ్వాన్సడ్ రీసెర్చ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. పూర్తికాల సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచుతోంది. ఏటా వేసవి సెలవుల్లో (మే నుంచి జూన్ చివరి వరకు) ఈ శిక్షణ ఉంటుంది. ప్రారంభంలో విద్యార్థులను బ్యాచ్‌కు 6-8 మంది ఉండేలా ఐదారు బ్యాచ్‌లుగా విభజిస్తారు. వీరికి వారం పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీని తర్వాత ఒక్కో విద్యార్థిని ఒక్కో శాస్త్రవేత్త పరిధిలో ఉంచుతారు. ఈ శాస్త్రవేత్త పర్యవేక్షణలో విద్యార్థి ఓ చిన్న ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది. చివర్లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలి. వీటిని పరిగణనలోకి తీసుకుని ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. ఎంటెక్/ఎంఈ/ఎంఎస్సీ మొదటి ఏడాది పూర్తిచేసిన వారు, బీటెక్/బీఈ రెండు, మూడో ఏడాది విద్యార్థులు వేసవి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వెబ్సైట్: www.arci.res.in ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ స్కిల్స్ ‘‘విద్యార్థులు తరగతి గదిలో కేవలం అకడమిక్స్ అంశాలను మాత్రమే నేర్చుకుంటారు. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో మాత్రమే పొందగలరు. ముఖ్యంగా సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాక్టికల్ పరిజ్ఞానమే దిక్సూచి. ఇటీవలి కాలంలో బహుళజాతి సంస్థలు.. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి, ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత ప్లేస్‌మెంట్స్ పొందడానికి తోడ్పాటునందిస్తున్నాయి. ఎంహెచ్ఆర్డీ ప్రకటించిన ఇంటర్న్‌షిప్ పథకం విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు నిర్ణీత కాల వ్యవధిలో ముఖ్యంగా వేసవిలో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు’’ - డాక్టర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్, జేఎన్టీయూహెచ్ -
ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు..
నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా చేతపట్టుకొని బయటకు వస్తూనే నచ్చిన కంపెనీలో, మెచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంతో పోల్చితే ప్రస్తుతం కంపెనీల అవసరాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకనుగుణంగా మల్చుకుంటూ పోటీ వాతావరణంలో సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టే నైపుణ్యం గల మానవ వనరులను నియమించుకోవడానికి అవి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే ఉద్యోగార్థులకు సరైన నైపుణ్యాల సాధన తప్పనిసరి అయింది. ప్రాక్టికల్ పరిజ్ఞానం ముఖ్యం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ కళాశాలల్లో లేబొరేటరీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు వీటిలో ప్రాక్టికల్స్ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల సబ్జెక్టుల భావనలపై సులువుగా పట్టు సాధించవచ్చు. ఓ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వివిధ రకాలుగా అనువర్తింపజేసే నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ల్యాబ్ సెషన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్: ‘‘నాకు సబ్జెక్టుపై బాగా పట్టు ఉంది. నా దగ్గర సందేహాలు నివృత్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయి. నాకు మాత్రం ప్రతిసారీ నిరాశ ఎదురవుతోంది. నా పరిజ్ఞానాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతుండటమే దీనికి ప్రధాన కారణం’’- చాలా మంది విద్యార్థుల నోటి నుంచి వస్తున్న మాటలివి. ఎంత సబ్జెక్టు ఉన్నా సరిగా బహిర్గతం చేయలేకపోతే ఉద్యోగం దొరకడం ఎండమావే. అందుకే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. అందుకే కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్లను చదవడం, బీబీసీ వంటి చానల్స్ చూడటం ద్వారా ఆ భాషపై పట్టు సాధించవచ్చు. ఇతర నైపుణ్యాలు: కళాశాలలో వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించేందుకు వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీడీలపై దృష్టిసారించాలి. ఇప్పుడు బహుళ జాతి సంస్థల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికీ ఇవి ఉపయోగపడతాయి. కంప్యూటర్‌కు సంబంధించి సీ లాంగ్వేజ్‌ను కాలేజీలో ఎలాగూ నేర్పుతారు కాబట్టి దీనికి అదనంగా బయట మార్కెట్లో జావాను కూడా నేర్చుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం తీరిది.. నైపుణ్యాలతో నిండుకుండలా ఉండే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర బ్రాంచ్‌ల ఇంజనీర్లను పరిశ్రమలు వివిధ విభాగాల్లో, వివిధ హోదాలతో నియమించుకుంటాయి. పరిశోధన-అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్ ఎక్స్‌లెన్స్, స్ట్రక్చరల్ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో బాధ్యతలను అప్పగిస్తాయి. సాధారణంగా సంస్థల ప్రతినిధులు ఉద్యోగుల ఎంపిక సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల అకడమిక్ రికార్డు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాయి. సృజనాత్మకత, పనిలో వేగం-కచ్చితత్వం, తక్కువ ఖర్చుతో విలువైన ఫలితాలను రాబట్టే నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. వేతనాలు: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఇంజనీర్లకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, సీనియర్ ఇంజనీర్లకైతే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ అనుభవం ఓ విద్యార్థి తాను చేస్తున్న కోర్సుకు సంబంధించి కాలేజీలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా అన్వయించడానికి ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. మంచి కొలువులకు మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండు, మూడు నెలల పాటు ఓ కంపెనీలో ఉంటూ సొంతం చేసుకున్న పని అనుభవం పటిష్టమైన కెరీర్‌కు పునాది వేస్తుంది. అందువల్ల విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉత్సాహం చూపాలి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మూడో సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ ఫెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించిన వారికి తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. ఇంటర్న్‌షిప్ సాధారణంగా వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు ఉంటుంది. టాప్ స్టోరీ ‘‘దాదాపు 30 శాతం మంది ఐటీ/కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉపయోగించే ప్రాథమిక ైభావనలపై అవగాహన లేదు’’ - యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనంలో తేలిన విషయమిది! ‘‘భారత దేశంలో కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 27 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపు ణ్యాలు ఉన్నాయి’’ - నాస్కామ్ స్కిల్ సర్వే వెల్లడించిన అంశమిది! ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. నేటి పోటీ ప్రపంచంలో కంపెనీని ప్రగతి పథంలో పయనింపజేసే నిపుణులకే ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. ఏటా దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వస్తున్న లక్షల మందిలో కొంత మందికే ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారి సంగతేమిటి? ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు హబ్‌గా ఉన్న హైదరాబాద్ విద్యార్థులు ఉజ్వల కెరీర్‌ను చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఏ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి? తదితరాలపై ఫోకస్... కాలేజీ వైపు నుంచి విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా కళాశాలలు తమ వంతు కృషి చేయాలి. కళాశాలకు పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి, వారి అవసరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా కరిక్యులంను మార్చాలి. కేవలం విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి చేరువ చేయాలి. వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి. ఇంటర్న్షిప్స్, అప్రెంటీస్‌షిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి. అవసరమైన సహాయం అందించాలి. -
నిరుప్రయోగం
కర్నూలు(విద్య): జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమికోన్నత, 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 11 ప్రాథమికోన్నత, 16 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే 335 జిల్లా పరిషత్ , 25 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 45 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవిగాక 32 మోడల్ స్కూళ్లు, 54 కస్తూరిబాగాంధీ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందించేందుకు విధిగా ప్రయోగశాలలు నిర్వహించాలి. పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్‌గ్రాంట్ నిధుల నుంచి వీటికి అవసరమైన పరికరాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధిక శాతం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. వారానికి నాలుగుసార్లు చొప్పున 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రసాయన, జీవశాస్త్రాల్లో ప్రయోగ పాఠాలు చెప్పాలి. అయితే జిల్లాలో 450 పాఠశాలల్లో ప్రయోగశాలలకు గదుల్లేవు. ఈ కారణంగా ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా కొనుగోలు చేసిన పరికరాలను వారు బీరువాల్లోనే ఉంచేశారు. గత యేడాది 150 పాఠశాలల్లో గదులు నిర్మించినా వాటిని విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపయోగించుకుంటున్నారు. రెగ్యులర్‌గా ప్రయోగశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, మరోవైపు ఉపాధ్యాయుల నిరాసక్తత కారణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య దూరమవుతోంది. అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు చార్ట్‌లలో చిత్రాలు గీసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. చాలా పాఠశాలల్లో మైక్రోస్కోప్‌లు, స్ప్రింగ్ త్రాసులు పనిచేయడం లేదు. ఇప్పటికీ జిల్లాలోని 95 శాతం పాఠశాలల్లో ప్రయోగశాలల దుమ్ముకూడా దులపడం లేదు. ఎక్కడికక్కడ పరికరాలు బీరువాల్లో మూలుగుతున్నాయి. బట్టీకొట్టే చదువుకంటే స్వతహాగా ప్రయోగాల ద్వారా నేర్చుకునే అంశంపై బాగా గుర్తుంటుందన్న విషయాన్ని ఉపాధ్యాయులు మరుస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థుల పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది. ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవడానికి, నిర్ధారణకు రావడానికి ప్రయోగాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో సర్దుబాటు గుణం, అవగాహన సామర్ధ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయులు చేయడమే గాక విద్యార్థులతో ప్రయోగాలు చేయించినట్లయితే భవిష్యత్‌లో వారు మంచి పరిశోధకులుగా మారే అవకాశం ఉంది. - విజయకుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు ప్రత్యేక గదులుండాలి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నప్పటికీ చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ల్యాబ్ పరికరాలు చెడిపోయాయి. దీనికితోడు తరగతి గదిలోనే ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ప్రయోగశాలకు అవసరమైన గదిని నిర్మించాలి. దాని నిర్వహణకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును క్రియేట్ చేయాలి. - ఇస్మాయిల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇకపై ప్రయోగశాలలపై దృష్టిసారిస్తాం ఈ ఏడాది నుంచి ప్రయోగశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ప్రయోగశాల నిర్వహణకు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఒక్కో పాఠశాలకు సైన్స్‌ఫేర్, ల్యాబ్ కెమికల్స్, పరికరాల కొనుగోలుకు రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రయోగశాలలు బలోపేతం చేయనున్నాం. మూడో విడతలో భాగంగా ఈ యేడాది మరో 150 పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల ద్వారా ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు నిర్మించనున్నాం. ఇప్పటికే పూర్తయిన 150 పాఠశాలల్లోని గదుల్లో ప్రయోగశాలలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. - కె. నాగేశ్వరరావు, డీఈవో