ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు.. | important skills to select a job | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు..

Published Sat, Sep 27 2014 11:53 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు.. - Sakshi

ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు..

నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా చేతపట్టుకొని బయటకు వస్తూనే నచ్చిన కంపెనీలో, మెచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంతో పోల్చితే ప్రస్తుతం కంపెనీల అవసరాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకనుగుణంగా మల్చుకుంటూ పోటీ వాతావరణంలో సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టే నైపుణ్యం గల మానవ వనరులను నియమించుకోవడానికి అవి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే ఉద్యోగార్థులకు సరైన నైపుణ్యాల సాధన తప్పనిసరి అయింది.
 
ప్రాక్టికల్ పరిజ్ఞానం ముఖ్యం
ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ కళాశాలల్లో లేబొరేటరీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు వీటిలో ప్రాక్టికల్స్ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల సబ్జెక్టుల భావనలపై సులువుగా పట్టు సాధించవచ్చు. ఓ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వివిధ రకాలుగా అనువర్తింపజేసే నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ల్యాబ్ సెషన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి.
 
కమ్యూనికేషన్ స్కిల్స్: ‘‘నాకు సబ్జెక్టుపై బాగా పట్టు ఉంది. నా దగ్గర సందేహాలు నివృత్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయి. నాకు మాత్రం ప్రతిసారీ నిరాశ ఎదురవుతోంది. నా పరిజ్ఞానాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతుండటమే దీనికి ప్రధాన కారణం’’- చాలా మంది విద్యార్థుల నోటి నుంచి వస్తున్న మాటలివి. ఎంత సబ్జెక్టు ఉన్నా సరిగా బహిర్గతం చేయలేకపోతే ఉద్యోగం దొరకడం ఎండమావే. అందుకే ఇంగ్లిష్ కమ్యూనికేషన్  స్కిల్స్ చాలా ముఖ్యం. అందుకే కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్లను చదవడం, బీబీసీ వంటి చానల్స్ చూడటం ద్వారా ఆ భాషపై పట్టు సాధించవచ్చు.
 
ఇతర నైపుణ్యాలు: కళాశాలలో వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించేందుకు వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీడీలపై దృష్టిసారించాలి. ఇప్పుడు బహుళ జాతి సంస్థల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికీ ఇవి ఉపయోగపడతాయి. కంప్యూటర్‌కు సంబంధించి సీ లాంగ్వేజ్‌ను కాలేజీలో ఎలాగూ నేర్పుతారు కాబట్టి దీనికి అదనంగా బయట మార్కెట్లో జావాను కూడా నేర్చుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
 
ఉద్యోగం తీరిది.. నైపుణ్యాలతో నిండుకుండలా ఉండే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర బ్రాంచ్‌ల ఇంజనీర్లను పరిశ్రమలు వివిధ విభాగాల్లో, వివిధ హోదాలతో నియమించుకుంటాయి. పరిశోధన-అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్ ఎక్స్‌లెన్స్, స్ట్రక్చరల్ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో బాధ్యతలను అప్పగిస్తాయి. సాధారణంగా సంస్థల ప్రతినిధులు ఉద్యోగుల ఎంపిక సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల అకడమిక్ రికార్డు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాయి. సృజనాత్మకత, పనిలో వేగం-కచ్చితత్వం, తక్కువ ఖర్చుతో విలువైన ఫలితాలను రాబట్టే నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి.
 
వేతనాలు: జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఇంజనీర్లకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్‌మెంట్‌లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, సీనియర్ ఇంజనీర్లకైతే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందుతుంది.
 
ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ అనుభవం

ఓ విద్యార్థి తాను చేస్తున్న కోర్సుకు సంబంధించి కాలేజీలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా అన్వయించడానికి ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. మంచి కొలువులకు మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండు, మూడు నెలల పాటు ఓ కంపెనీలో ఉంటూ సొంతం చేసుకున్న పని అనుభవం పటిష్టమైన కెరీర్‌కు పునాది వేస్తుంది. అందువల్ల విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉత్సాహం చూపాలి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మూడో సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ ఫెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించిన వారికి తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. ఇంటర్న్‌షిప్ సాధారణంగా వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు ఉంటుంది.
 
టాప్ స్టోరీ
‘‘దాదాపు 30 శాతం మంది ఐటీ/కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉపయోగించే ప్రాథమిక ైభావనలపై అవగాహన లేదు’’
 - యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనంలో తేలిన విషయమిది!
‘‘భారత దేశంలో కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 27 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపు ణ్యాలు ఉన్నాయి’’
 - నాస్కామ్ స్కిల్ సర్వే వెల్లడించిన అంశమిది!

ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. నేటి పోటీ ప్రపంచంలో కంపెనీని ప్రగతి పథంలో పయనింపజేసే నిపుణులకే ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. ఏటా దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వస్తున్న లక్షల మందిలో కొంత మందికే ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారి సంగతేమిటి? ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు హబ్‌గా ఉన్న హైదరాబాద్ విద్యార్థులు ఉజ్వల కెరీర్‌ను చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి?  ఏ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి? తదితరాలపై ఫోకస్...
 
కాలేజీ వైపు నుంచి
విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా కళాశాలలు తమ వంతు కృషి చేయాలి.
కళాశాలకు పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి, వారి అవసరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా కరిక్యులంను మార్చాలి.
కేవలం విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి చేరువ చేయాలి.
వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి.
ఇంటర్న్‌షిప్స్, అప్రెంటీస్‌షిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి. అవసరమైన సహాయం అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement