మయాంక్, పంత్ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్’
భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ అదిరింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్‌ను చక్కగా ఆడుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టారు. టెస్టులకు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసం దక్కించుకున్నారు. వన్డేల్లో పోయిన సిరీస్‌ను టెస్టుల ద్వారా రాబట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
హామిల్టన్: తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇద్దరే ఆడారు. మిగతా వారు ప్రాక్టీస్‌లో ఫెయిలయ్యారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కరు మినహా అందరూ పాసయ్యారు. ఓవరాల్‌గా భార త బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాడిన పడ్డారు. ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో ‘బర్త్‌డే బాయ్’ మయాంక్ అగర్వాల్ (99 బంతుల్లో 81 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) తనకు తాను ఓ ఫిఫ్టీ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. రిషభ్ పంత్ (65 బంతుల్లో 70; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. దీంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మిచెల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఈ నెల 21 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది.
రాణించిన మయాంక్...
ఆఖరి రోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 59/0తో ఆట మొదలైన కాసేపటికే పృథ్వీషా (31 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆట ముగిసింది. క్రితంరోజు స్కోరుకు మరో 4 పరుగులే జతచేసిన పృథ్వీని మిచెల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శుబ్‌మన్ గిల్ (8) రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్ ఇటీవల కివీస్ గడ్డపై అనధికారిక టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. ఓపెనింగ్‌లో శతకం, మిడిలార్డర్లో ద్విశతకంతో టీమ్ మేనేజ్మెంట్ను విశేషంగా ఆకర్షించాడు. కానీ ఇక్కడ మిచెల్ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు.
ఈ దశలో మయాంక్‌కు రిషభ్ పంత్ జతయ్యాడు. ఇద్దరు జట్టు స్కోరును చకచకా వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో మయాంక్ 56 బంతుల్లో (9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ టచ్‌లోకి రావడం టీమిండియాకు ఉపశమనం కలిగించే అంశం. గత 11 ఇన్నింగ్స్‌లలో 40 పరుగులను కూడా చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘ఒకటి’కే అవుటయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మయాంక్ ఎట్టకేలకు తన బ్యాటింగ్ సత్తాచాటడం విశేషం. పరుగులు, అర్ధసెంచరీని పక్కనబెడితే వికెట్ సమర్పించుకోకుండా ఆడినంతసేపూ సాధికారికంగా అడాడు. తొమ్మిది మంది బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
పంత్ ఫటాఫట్...
మయాంక్, పంత్ జోడీ ఆతిథ్య బౌలర్లను అదేపనిగా ఇబ్బందిపెట్టింది. బౌండరీలతో ఫీల్డర్లనూ చెమటలు కక్కించింది. ఇద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో స్కోరు వన్డేలా పరుగెత్తింది. ముఖ్యంగా పంత్ భారీ సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక జట్టు స్కోరు 182 పరుగుల వద్ద మయాంక్ మిగతావారి ప్రాక్టీస్ కోసం రిటైర్డ్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన సాహా అండతో పంత్ 53 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. టెస్టుల్లో తనకంటే సీనియర్ అయిన సాహా కంటే ఎంతో మెరుగ్గా, సౌకర్యంగా పంత్ బ్యాటింగ్ చేశాడు.
జట్టు స్కోరు 200 పరుగులకు చేరుకుంది. ధనాధన్‌గా సాగిపోతున్న అతని మెరుపు ఇన్నింగ్స్‌కు మిచెల్ బ్రేకులేశాడు. దీంతో 216 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత సాహా (38 బంతుల్లో 30 నాటౌట్; 5 ఫోర్లు), అశ్విన్ (43 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) నింపాదిగా ఆడుకున్నారు. భారత్ స్కోరు 250 పరుగులను అధిగమించింది. ఇక ఫలితం ఎలాగూ ‘డ్రా’ అని... ఒక గంట ముందుగానే మ్యాచ్‌ను ముగించేందుకు ఇరు జట్ల కెప్టెన్లు సమ్మతించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 మంది కివీస్ బౌలర్లు బౌలింగ్ చేశారు. అయితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై ఒక్క మిచెల్ (3/33) మినహా ఇంకెవరూ ప్రభావం చూపలేకపోయారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 263; న్యూజిలాండ్ ఎలెవన్ ఇన్నింగ్స్: 235; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) మిచెల్ 39; మయాంక్ (రిటైర్డ్ అవుట్) 81; శుబ్‌మన్ గిల్ ఎల్బీడబ్ల్యూ (బి) మిచెల్ 8; రిషభ్ పంత్ (సి) క్లీవర్ (బి) మిచెల్ 70; సాహా (నాటౌట్) 30; అశ్విన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48 ఓవర్లలో 4 వికెట్లకు) 252.
వికెట్ల పతనం: 1–72, 2–82, 3–182, 4–216.
బౌలింగ్: టిక్నెర్ 3–0–19–0, కుగ్లిన్ 12–0–81–0, జాన్స్టన్ 4–0–18–0, మిచెల్ 9–2–33–3; నీషమ్ 6–1–29–0, సోధి 5–0–32–0, కూపర్ 3–0–27–0, బ్రూస్ 5–1–8–0, అలెన్ 1–1–0–0.