న్యాయం కావాలి
బరంపురం: సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి తన జీవితాన్ని నాశనం చేసిన మృగాళ్లను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయండి. ఎస్పీ సార్.. అంటూ ఓ బాలిక మంగళవారం మధ్యాహ్నం బరంపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది.
ఈ సందర్భంగా బాధిత బాలిక, ఆమె బంధువు విలేకరులతో మాట్లాడుతూ గంజాం జిల్లా చికిటి సమితి జరడా పోలీసుస్టేషన్ పరిధిలో గల ధన్నగొడా గ్రామానికి చెందిన తాను గతనెల 9వ తేదీన రాత్రి ఇంటిలో పడుకున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు దుర్మార్గులు కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి సాముహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారని రోదించింది. అలా ఈ నెల 18వ తేదీ వరకు ఆ మృగాళ్లు సాముహికంగా లైంగికదాడికి పాల్పడుతూ నరకయాతన పెట్టారంటూ కన్నీటి పర్యంతమైంది. జరడా పోలీసులందరూ తమకు తెలుసని ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్పీకి తన మొర వినిపించి ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు చెప్పింది.
అనంతరం ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్కు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఎస్పీకి అందజేసిన ఫిర్యాదు కాపీలో లైంగిక దాడితో సంబంధం ఉన్న వారిలో ధన్నమోర గ్రామానికి చెందిన శ్రీధర్ ప్రధాన్, వాలి ప్రధాన్, కన్ను ప్రధాన్, కొంబలి ప్రధాన్, కర్జి ప్రధాన్ పేర్లు ఉన్నాయి. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి సంబంధిత నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్ బాధితులకు హామీ ఇచ్చారు.