ఆటో ఎక్స్పో 2020: కంపెనీలు డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దీర్ఘకాలిక మందగమనం రానున్న ఆటో ఎక్స్‌పోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అట్టహాసంగా జరగనున్న ఈ ఎక్స్‌పోలో దేశీయ కంపెనీలతోపాటు, డజనుకుపైగా కంపెనీలు పాలు పంచుకోవడం లేదు. మరోవైపు ఆటో ఎక్స్పో 2020 లో పాల్గొనకపోడానికి ఆయా కంపెనీలకు వారి వారి సొంత కారణాలున్నప్పటికీ, ఈవెంట్ విజయవంతమవుతుందని పరిశ్రమల బాడీ సియామ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్ వంటి తోపాటు సహా డజనుకు పైగా వాహన తయారీదారులు ఆటోఎక్స్‌పో-2020 కు దూరంగా ఉండనున్నాయి. వీటితోపాటు రాయల్ ఎన్ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈవెంట్‌కు గతంలో కూడా డుమ్మాకొట్టాయి.
మరోవైపు ఈ లోటును తొలిసారిగా ఈ ఎక్స్‌పోలో పాలుపంచుకుంటున్నఎంజీ మోటార్, గ్రేట్ హవల్ మోటార్స్‌తో పాటు ఫోర్స్ మోటార్స్, అథర్ ఎనర్జీతోపాటు అనేక ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లు భర్తీ చేయనున్నాయి. అయితే ఆటో ఎక్స్‌పోతో ఆటోమొబైల్ రంగం మందగమనం నుంచి గట్టెక్కుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయంగా కొన్ని కంపెనీలు పాల్గొనకపోవచ్చు, దీనికి వారి సొంత కారణాలు వుండవచ్చు కానీ కొత్తగా వచ్చిన వారి ప్రభావం వుంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆటో షోల సంఖ్య కూడా తగ్గుతోందనీ, ఫ్రాంక్ఫర్ట్, టోక్యో వంటి దేశాల్లో కూడా కంపెనీల భాగస్వామ్యం తగ్గిందనీ, దీంతో పాటు మందగమనం, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని ఒకదశలో ఈవెంట్‌ను ఒక సంవత్సరం వాయిదా వేయాలని కూడా ఆలోచించామనీ ఈవెంట్ నిర్వాహకుడు సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి అమలుకానున్న బీఎస్-6 కొత్త ఉద్గార నిబంధనలు కూడా ప్రభావం చూపనున్నాయని తెలిపారు.
15వ ఎడిషన్‌గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 12 వరకూ జరగనున్న ఈ ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోలలో ఒకటిగా నిలవనుందని అంచనా. దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోఉన్న గ్రేటర్ నోయిడా వద్ద 235,000 చదరపు మీటర్ల స్థలంతో 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్నారు. సుమారు 60కి పైగా కొత్త వాహనాలు విడుదల అవుతాయని, రోజుకు లక్ష మంది సందర్శకులు రావచ్చని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ భావిస్తున్నారు.
కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు వరుసగా 9 మాసాల్లో క్షీణతను నమోదు చేశాయి. దీంతో మారుతి సుజుకి, ఆశోక్ లేలాండ్ కంపెనీలు ఉత్పత్తిలో కోత పెట్టాయి. తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేసాయి. అలాగే వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల విడిభాగాల కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. దీంతో లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు పరిశ్రమల వాల్యూమ్ దాదాపు 16 శాతం క్షీణించింది. ప్రయాణీకుల వాహనాలు 18 శాతం, వాణిజ్య వాహనాలు 22 శాతం, ద్విచక్ర వాహనాల 15.7 శాతం క్షీణించడం ఆటో పరిశ్రమలో సంక్షోభానికి ప్రధాన కారణం.
ఆటో ఎక్స్ పో-2018( ఫైల్ ఫోటో)