ప్రజా చావుకార సర్వే!
సాక్షి, తెనాలి: భార్యాబిడ్డలతో నిక్షేపంగా జీవిస్తున్న యువకుడు మరణించినట్లు ప్రజాసాధికార సర్వే సిబ్బంది నిర్లక్ష్యంగా నమోదు చేశారు. మరోవైపు కుటుంబ రేషను కార్డులో అతడి పేరు తొలిగిపోయింది. సర్వేలో భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలికి వెళ్లే అతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అవసరమైన శస్త్రచికిత్స కోసం ‘ఆరోగ్యశ్రీ’ని ఆశ్రయించినప్పుడు, అన్లైన్లో తన పేరు మృతుల జాబితాలో ఉన్నందున ఉచిత వైద్యం ఉందని తెలిసి నివ్వెరపోయాడు. ఆ అభాగ్యుడు తెనాలి వైకుంఠపురం దేవస్థానం సమీపకాలనీలో నివసించే దండమూరి శ్రీనివాస్.
శ్రీనివాస్ భవన నిర్మాణ పనుల కార్మికుడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తండ్రి పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి రమణ ప్రైవేటు ఆసుపత్రిలో పార్ట్ టైమ్ ఉద్యోగంతో నెలకు రూ.4 వేలు సంపాదిస్తున్నారు. అన్నయ్య సతీష్ వివాహం అనంతరం అత్తగారింట ఉంటున్నాడు. శ్రీనివాస్ 11 నెలల క్రితం తాపీ మేస్త్రితో కలిసి అతడి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తాపీ మేస్త్రి, శ్రీనివాస్ ఇద్దరూ కిందపడ్డారు. శ్రీనివాస్ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యుడు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అక్కడున్న ఆరోగ్యశ్రీ కౌంటరులో వివరాలు నమోదుచేయిస్తే, అనుమతి రాగానే చేస్తామని హామీనిచ్చారు.
ఆన్లైన్లో మృతుల జాబితాలో...
రేషను కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోని ఆరోగ్యమిత్ర కౌంటరుకు వెళ్లారు. కార్డు వివరాలను పరిశీలించిన అక్కడి సిబ్బంది, ఆన్లైన్లో దండమూడి శ్రీనివాస్ పేరు చనిపోయిన వ్యక్తుల జాబితాలో ఉందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. గాయపడి ఎదురుగా ఉన్న వ్యక్తిని చనిపోయాడని ఎలా చెబుతారని ప్రశ్నిస్తే, తామేం చేయలేమని ఆరోగశ్రీ వర్తించదని ఖరాకండీగా చెప్పేశారు. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లినా, అప్పటికప్పుడు ఏమీ చేయలేమని చెప్పారు. వైద్యుల సూచనతో విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర్లోని ఆరోగ్యశ్రీ ప్రత్యేక విభాగం వద్దకు క్షతగాత్రుడిని కారులో తీసుకెళ్లారు. అక్కడ సిబ్బందికి అతడిని చూపించి, పరిస్థితిని వివరించగా, ఆపరేషను నిమిత్తం లేఖ ఇచ్చారు. దానితో స్థానిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు.
తిరుపతిలో శస్త్రచికిత్స ఆవశ్యకత
శస్త్రచికిత్స తర్వాత కూడా చెయ్యి స్వాధీనం రాకపోవంతో శ్రీనివాస్‌కు మరోసారి వైద్యులు పరీక్షలు చేశారు. ప్రమాదంలో కలిగిన ఒత్తిడితో నరాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్ లేదా తిరుపతిలో చికిత్స చేయించుకోవాలని చెప్పటంతో అంతా కలిసి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేఖ పనిచేయలేదు. కేవలం అక్కడ వైద్య పరీక్షలు, లెబోరేటరీ పరీక్షలకే రూ.50 వేల ఖర్చయిందని శ్రీనివాస్ సోదరుడు సతీష్ చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తిరుపతిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని వివరించారు. ప్రజాసాధికార సర్వేలో దొర్లిన పొరపాటును సవరించి, రేషను కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులో పేరు చేర్చాలని తెనాలి తహసీల్దారు కార్యాలయానికి, గుంటూరు జిల్లా పౌరసరఫరాల అధికారి దగ్గరకు నాలుగు నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఫలితం లేదని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరోవైపు 11 నెలలుగా చేతికి కట్టుతో ఇంట్లోనే ఉంటున్నందున శ్రీనివాస్ కుటుంబానికి జరుగుబాటుకే కష్టంగా ఉంది. తల్లి, సోదరుడు ఆదుకుంటున్నారు. దీనికితోడు తిరుగుడుకు, వైద్యపరీక్షలకు అప్పులు చేస్తున్నారు.
అన్న అర్జీతో.. తమ్ముడి పేరునూ తొలగించారు...
పెళ్లి చేసుకుని అత్తగారింట ఉంటున్న దండమూడి సతీష్ ప్రత్యేకంగా రేషను కార్డు తీసుకోవాలని భావించాడు. ముందుగా తన తల్లి రమణ పేరిట గల తెల్లరేషను కార్డులోంచి తన పేరును తొలగించాలని అర్జీ పెట్టుకున్నాడు. చిత్రంగా అతడి పేరుతోపాటు, అతడి తమ్ముడు దండమూడి శ్రీనివాస్ పేరునూ తొలగించి, 2019 ఫిబ్రవరిలో జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో కేవలం తల్లి దండమూడి రమణ పేరుతో కార్డు మంజూరు చేశారు. కార్డుపై తల్లి, ఇద్దరు కొడుకుల ఫొటో ఉన్నా వారి పేర్లు లేకపోవడం గమనార్హం.