ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దొంగ సంతకాలతో ఫ్లాట్‌ను అమ్మిన కేసులో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుమీత్ సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శామీర్‌పేట పోలీసులు బుధవారం సుమీత్ సేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం... ప్రజయ్ హోమ్స్ మాజీ సీఎండీ లేటు చంద్రమోహన్‌రెడ్డి భార్య హైమావతీరెడ్డికి మజీద్‌పూర్ గ్రామ పరిధిలో ప్రజయ్ హోమ్స్‌లోని తన 429 గజాల ఫ్లాట్‌ను దొంగ సంతకాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని సుమిత్ సేన్, విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమలపై ఈ నెల 16 న శామీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన శామీర్‌పేట పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమిత్ సేన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా ఫోర్జరీ చేసినట్లు ఆధారాలు లభించడంతో మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పరిచి జైలుకి పంపినట్లు శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
పరారీలో మరో నలుగురు...
ఇదే కేసులో మరో నలుగురు నిందితులు విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.