అనుమతి ఒకలా.. కట్టింది ఇంకోలా!
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ ఎల్‌బీ నగర్‌లో 8 వేల గజాల్లో ప్రిన్స్‌టన్ టవర్ పేరిట వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది. ఇందులో ఒక్కో అంతస్తు 30 వేల చ.అ.ల్లో విస్తరించి ఉంది. అయితే వాస్తవానికి నిర్మాణ అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణం మాత్రం మరోలా ఉంది. అంటే స్థానిక సంస్థ నుంచి పోడియం టవర్ స్టైల్‌లో అనుమతులను తీసుకున్న నిర్మాణ సంస్థ.. కట్టింది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా! జీ+1 మినహా మిగిలిన అన్ని అంతస్తుల్లోనూ అనుమతులను ఉల్లఘించింది.
సెట్‌బ్యాక్స్‌లోనూ అతిక్రమణే. పైపెచ్చు జీ+1కు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుని అన్ని అంతస్తులనూ వినియోగించేస్తుంది కూడా. 1.25 లక్షల చ.మీ. స్థలాన్ని 3 లెవల్స్ పార్కింగ్ కోసం కేటాయించారు. జీ+5 వరకు వాణిజ్య స్థలాన్ని, 6వ అంతస్తులో ఆఫీస్ స్పేస్, ఆ తర్వాతి అంతస్తులో బాంక్విట్ హాల్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్లాన్‌లో 7వ అంతస్తులోని హోటల్ డిజైన్ ఒకలా ఉంటే.. నిర్మాణంలో మాత్రం ఇంకోలా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 5 శాతం స్థలాన్ని కస్టమర్లు కొనుగోలు చేస్తే.. మిగిలినవి లీజుకు తీసుకున్నారు కూడా.