నిజాంపేటలో వైఎస్సార్ సీపీ విజయం
3214 ఓట్ల మెజార్టీతో గెలిచిన ప్రమీల యాదవ్
నిజాంపేట, న్యూస్‌లైన్: గ్రేటర్ విలీన పంచాయతీల్లో అతిపెద్ద గ్రామమైన నిజాంపేట సర్పంచ్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు శనిగల ప్రమీల యాదవ్ 3,214 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
కుత్బుల్లాపూర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలను శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన నిజాంపేటలో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కీలకమైన ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ గెలుపొందడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.