అదానీ గ్రూప్ గూటిలో ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ తాజాగా 27.26 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి ఎగసింది. వెరసి ఎన్డీటీవీపై పూర్తి నియంత్రణను సాధించింది. గత వారం రాయ్ జంట తమకుగల 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఎన్డీటీవీలో రాయ్‌లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా ఉంది. తాజా లావాదేవీ తదుపరి రాయ్‌ల వాటా(2.5 % చొప్పున) 5 శాతానికి పరిమితమైంది. షేరుకి రూ. 342.65 ధరలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. మైనారిటీ వాటాదారులకు చెల్లించిన(ఓపెన్ ఆఫర్) ధరతో పోలిస్తే ఇది 17 శాతం అధికంకాగా.. తద్వారా రాయ్ జంట రూ. 602 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ద్వారా వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది.
రాయ్‌ల రాజీనామాలు
యాజమాన్య నియంత్రణ పూర్తిస్థాయిలో చేతులు మారిన నేపథ్యంలో వ్యవస్థాపకులు ప్రణవ్ రాయ్, రాధికా రాయ్‌సహా మరో నలుగురు డైరెక్టర్లు బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అంతేకాకుండా కనీస వాటా మాత్రమే మిగిలిన మాజీ ప్రమోటర్లు కంపెనీలో తమను పబ్లిక్ కేటగిరీ వాటాదారులుగా పరిగణించమంటూ బోర్డుని అభ్యర్థించారు. ఇందుకు బోర్డు అనుమతించగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, వాటాదారులు ఆమోదముద్ర వేయవలసి ఉన్నట్లు ఎన్డీటీవీ తెలియజేసింది.
బోర్డు నుంచి తప్పుకున్న డైరెక్టర్లలో డారియస్ తారాపోర్వాలాతోపాటు, స్వతంత్ర డైరెక్టర్లు కౌశిక్ దత్తా, ఇంద్రాణి రాయ్, జాన్ మార్టిన్ ఓలోన్ ఉన్నారు. ఇప్పటివరకూ ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కోచైర్పర్శన్ పదవిలో ఉన్న విషయం విదితమే. మరోవైపు అమన్ కుమార్ సింగ్‌ను నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా, సునీల్ కుమార్‌ను స్వతంత్ర నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు
ఎన్డీటీవీ వెల్లడించింది.
ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు 2.6% లాభపడి రూ. 348 వద్ద ముగిసింది.