'ఆ విషయం ధోనికి తెలుసు'
చెన్నై:గత కొంతకాలంగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీపై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధోని కెప్టెన్సీ నుంచి తొలగించి విరాట్ కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పడమే సరైనది అంటూ పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధోని వారుసుడిగా ఇప్పటికే టెస్టు సారథి పగ్గాలు స్వీకరించిన కోహ్లి సక్సెస్ కావడంతో వారి వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే అది సరైన చర్య కాదని అంటున్నాడు మాజీ భారత సెలక్టర్ ప్రణబ్ రాయ్.
2004లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో ధోని ఎంపిక కావడానికి ప్రధాన కారణమైన ప్రణబ్ రాయ్.. ఇంకా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం రాలేదంటున్నాడు. 'కెప్టెన్సీ నుంచి ధోని ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. ప్రస్తుతం ధోనికి ప్రత్యామ్నాయం లేదు. అతను ఒక ఆటగాడిగా, నాయకుడిగా సక్సెస్ అయ్యాడు. అసలు కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచనే వద్దు. కోహ్లికి బాటన్ ఎప్పుడు ఇవ్వాలో ధోనికి తెలుసు'అని ప్రణబ్ రాయ్ తెలిపాడు.
గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన పలు టెస్టు మ్యాచ్లను కోల్పోవడంతో ధోని ఆకస్మికంగా ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అతని నిర్ణయం తనను ఆశ్చర్య పరిచింది. 90 టెస్టుల్లో ఆడిన ధోని ఆ తరహా నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదని ప్రణబ్ తెలిపాడు. కాగా, అతను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయానికి అంతా గౌరవం ఇవ్వాలన్నాడు. అయితే ఒక సెలక్టర్ గా ధోని ఎంపిక చేయడం తన అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నాడు.