సీనియర్లు లేకుండా మరో టి20 సిరీస్... రోహిత్ శర్మ, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా, వరల్డ్‌కప్ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్ వరుసగా మూడో సిరీస్... వన్డేల్లో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఇప్పుడు టి20ల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది.
ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఉండటంతో టి20 ఫార్మాట్‌కు ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో సీజన్‌లో చివరి టి20 ద్వైపాక్షిక పోరులో సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లకు మరో అవకాశం దక్కింది. గత ప్రత్యర్థి శ్రీలంక తరహాలో కివీస్ కూడా కనీసం ఈ ఫార్మాట్‌లో అయినా పోటీనిస్తుందా లేదా అనేది చూడాలి.
రాంచీ: దాదాపు ఏకపక్షంగా సాగిన వన్డే సిరీస్ తర్వాత టి20ల్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 పోరు జరగనుంది. అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం.
గిల్‌తోనే ఓపెనింగ్...
దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్‌కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు.
శ్రీలంకతో సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన గిల్ టి20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అయితే వన్డేల్లో అతని తాజా ఫామ్‌ను చూస్తే జట్టులో స్థానం ఇవ్వక తప్పదని కూడా హార్దిక్ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి తన సత్తాను గత మ్యాచ్‌లో చూపించగా... నాలుగో స్థానంలో ‘ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ రూపంలో సూర్యకుమార్ సిద్ధంగా ఉన్నాడు.
ఆల్‌రౌండర్‌గా దీపక్ హుడా బరిలోకి దిగనుండగా, పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌కు చోటు ఖాయమైంది. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావిలపైనే జట్టు భారం ఉంది. మున్ముందు అగ్రశ్రేణి బౌలర్లు వచ్చినా... తమ స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో వీరు సత్తా చాటాల్సి ఉంది. మణికట్టు స్పిన్నర్ స్థానానికి సహజంగానే కుల్దీప్, చహల్ మధ్య పోటీ నెలకొంది.
ఇష్ సోధికి చోటు...
వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్‌ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా సాన్‌ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు.
తాజా వన్డే సిరీస్‌లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. ఆల్‌ఫార్మాట్ బ్యాటర్‌గా తనకంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకొని చివరి వన్డేలో సెంచరీ బాదిన కాన్వే మరోసారి కీలకం కానుండగా... ముగ్గురు ఆల్‌రౌండర్లు మిచెల్, బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ రాణిస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.
పేస్ బౌలింగ్‌లో కివీస్ బాగా బలహీనంగా కనిపిస్తోంది. లిస్టర్, షిప్లీ ఇప్పటివరకు టి20లు ఆడకపోగా... టిక్నర్, డఫీ అనుభవం కూడా అంతంత మాత్రమే. దాంతో ఫెర్గూసన్‌పై అదనపు భారం పడింది. లిస్టర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హుడా, సుందర్, మావి, ఉమ్రాన్, అర్ష్‌దీప్, కుల్దీప్/చహల్.
న్యూజిలాండ్: సాన్‌ట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్‌మన్, ఫిలిప్స్, మిచెల్, మైకేల్ బ్రేస్‌వెల్, టిక్నర్, సోధి, లిస్టర్, ఫెర్గూసన్.
చదవండి: Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో ఓటమిపాలైన సానియా-బోపన్న జోడి
Comments
Please login to add a commentAdd a comment