prarthana thombare
-
సానియా జోడీ నిష్క్రమణ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.మహిళల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్‌లో సానియా ద్వయం 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జోడి షాయి జంగ్-షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్డ్ డబుల్స్పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-రోహన్ బోపన్నలు జోడి కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్లో పరాజయం ఎదుర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన సానియా-రోహన్ బోపన్నలు మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగనున్నారు. -
ప్రార్థనకు టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: టాప్ సీడ్ ప్రార్థన తొంబరే తన కెరీర్లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్ ఫైనల్లో ఆమె ఢిల్లీకి చెందిన రిషిక సుంకరపై గెలిచింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రార్థన 6-7, (4/7), 6-4, 6-3తో నాలుగో సీడ్ రిషికపై చెమటోడ్చి నెగ్గింది. ఒక రకంగా ప్రార్థన... డబుల్స్‌లో రిషిక జోడి చేతిలో తనకెదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మదా బాలు జంట... ప్రార్థన-శ్వేతా రాణా జోడిని కంగుతినిపించిన సంగతి తెలిసిందే. -
తుది పోరుకు సౌజన్య, ప్రార్థన
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి టైటిల్ పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఆమె రెండో సీడ్ ప్రార్థన తొంబరేతో తలపడుతుంది. ఇక్కడి ఈఎంఎంటీసీ కోర్టుల్లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో రాష్ట్రానికే చెందిన ఎనిమిదో సీడ్ నిధి చిలుములకు చుక్కెదురైంది. సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 400వ ర్యాంకర్ ప్రార్థన 7-6 (7/4), 6-2తో నిధిని ఓడించింది. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఏపీ అమ్మాయి తొలిసెట్లో పోరాడింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇందులో ప్రత్యర్థిదే పైచేయి అయింది. రెండో సెట్లో మాత్రం నిధి ఆశించిన మేర రాణించలేకపోయింది. మరో సెమీస్‌లో అన్‌సీడెడ్ సౌజన్య 6-4, 6-0తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీని కంగుతినిపించింది. ఆరంభంలో ప్రేరణ 3-1తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ సౌజన్య పుంజుకొని ఆడటంతో ఆమె చతికిలబడింది. రెండో సెట్లో ఏ మాత్రం పోటీలేకుండానే సౌజన్య ముందంజ వేసింది. డబుల్స్ ఫైనల్లో ప్రార్థన-అంకిత రైనా జోడి 6-3, 6-3తో శ్వేత రాణా-రిషిక సుంకర ద్వయంపై గెలిచి టైటిల్ చేజిక్కించుకుంది.