పదసౌకమార్యం... పారిజాతాప హరణం
భావ పరిమళాల జల్లు భువన విజయం
సాహితీ ప్రసంగంలో డాక్టర్ రాఘవేంద్రరావు
రాజమహేంద్రవరం కల్చరల్ : శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరైనంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ ప్రబంధాన్ని భామా విజయంగా, సత్యభామా విజయంగా పేర్కొనవచ్చునని రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.రాఘవేంద్రరావు తెలిపారు. నన్నయ వాజ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న భువన విజయ సాహితీ ప్రసంగ పరంపరలలో భాగంగా, సోమవారం ఆయన పారిజాతాపహరణంపై ప్రసంగించారు. పదసౌకుమార్యానికి, భావ పరిమళాలకు నంది తిమ్మన రచన అచ్చంగా పారిజాతమేనని ఆయన అభివర్ణించారు. 'అల్లసానివారి’ అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు, పాండురంగవిభుని పదగుంభనంబు' అని ఒక చాటువు ఆయా కవులరచనా విశిష్టతను తెలియచేస్తున్నదని రాఘవేంద్రరావు తెలిపారు. తెలుగు సాహిత్యంలో పదిమంది అగ్రప్రబంధ నాయకులలో సత్యభామ ఒకరన్నారు. ఆభిజాత్యం, అభిమానం, ఆత్మీయత, కోరికను సాధించుకునే పట్టుదలలో ఆమెకు ఆమే సాటి అని ఆయన చెప్పారు. ఐదు ఆశ్వాసాలలో, 512 పద్యగద్యాలలో నందితిమ్మన పారిజాతాపహరణం ప్రబంధాన్ని విరచించాడని, హరివంశంలో ఒక చిన్న కథ దీనికి ఆధారమని ఆయన తెలిపారు.
ఆంధ్ర సాహిత్యంలో మూడు ప్రసిద్ధి చెందిన ఏడుపు పద్యాలు ఉన్నాయని చెప్పారు. అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధిని అల్లిబిల్లిగా ఏడ్చింది. భట్టుమూర్తి వసుచరిత్రలో గిరికాదేవి బావురుమని ఏడ్చింది. నందితిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముద్దుముద్దుగా ఏడిచిందని ఆయన పేర్కొన్నారు. పద్యాలను రాగ, భావయుక్తంగా ఆలపించి రాఘవేంద్రరావు సాహిత్యాభిమానులను ఆకట్టుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాగౌతమి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ తెలుగుభాషను బతికిస్తున్నది ప్రవాసాంధ్రులు, విదేశాలలో ఉన్న తెలుగువారేనని తెలిపారు. పారిజాతాపహరణంలో నిజమైన గెలుపు సత్యభామది కాదని, రుక్మిణిదేనని ఆయన చెప్పారు. చింతలపాటి శర్మ, జోరా శర్మ, మంగళంపల్లి పాండురంగ విఠల్ తదితరులు హాజరయ్యారు.
నేటి భువన విజయంలో అందరూ మహిళలే
అమలాపురానికి చెందిన ద్విశతావధానిని ఆకెళ్ళ బాలభాను మొల్లరామాయణంపై మంగళవారం ప్రసంగిస్తారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథులంతా మహిళలే కావడం విశేషం