ఓటరు జాబితాను సవరించండి
ముంబై: ఓటరు జాబితాను సవరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సర్కార్ను ఆదేశించింది. ముంబై, పుణే నగరాలకు చెందిన ఓటరు జాబితా నుంచి దాదాపు 5 లక్షల మంది పేర్లను తొలగించారని, దీంతో లోక్సభ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే లోక్సభ ఫలితాలను నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
అవసరమైతే రాష్ట్రంలోని మూడు ప్రముఖ ప్రతికల్లో ప్రకటనల ద్వారా ఓటరు జాబితా సవరణ విషయమై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచిం చింది. అయితే ఈ సవరణకు, 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం ఉండబోదని న్యాయమూర్తులు అభయ్ ఓకా, ఎం.ఎస్. సోనక్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే విషయమై ప్రతాప్ గైక్వాడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మరో ఐదు కేసులను విచారణకు స్వీకరించినప్పటికీ తదుపరి విచారణ జరిగే తేదీకి వాయిదా వేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఎనిమిది వారాల్లోగా తెలపాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది.
ఓటరు జాబితాలో పేర్లను తొగించినందున మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనలపై కోర్టు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దమొత్తంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరాగా అక్కడ వారి పేరు లేకపోవడంతో చాలామంది ప్రముఖులు కూడా వెనుదిరిగారు. అనంతరం వారిలో చాలా మంది జాబితాలో పేర్లు తొలగించడాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కారు.